చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేని గూడెం గ్రామానికి చెందిన రుద్రవరం చంద్రయ్య–యాదమ్మ దంపతుల కుమారుడు రుద్రవరం సునీల్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవం మంగళవారం ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కార్యక్రమానికి హాజరై ప్రారంభోపన్యాసం చేశారు.
భారత్ బయోటెక్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొగులారం చేతుల మీదుగా రుద్రవరం సునీల్ పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సోషల్ వర్క్‌లో ‘ఇంపాక్ట్ ఆఫ్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఆన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ అనే అంశంపై పరిశోధన చేసి గ్రంథాన్ని సమర్పించారు. పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసినందుకు యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. డాక్టరేట్ పొందడం ద్వారా విద్యలో ఉన్నత స్థానం దక్కిందని పేర్కొన్నారు. డాక్టరేట్ స్వీకరించడం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన జ్ఞాపకమని తెలిపారు.
ఈ విజయం తన ఒక్కరిదే కాదని, తన తల్లిదండ్రులు, ప్రోత్సహించిన గురువులు, కష్టకాలంలో తన వెంట నడిచిన ప్రతి ఒక్కరి విజయమని సునీల్ పేర్కొన్నారు. డాక్టరేట్ కేవలం అర్హత మాత్రమే కాదని.. తనపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. తన డాక్టరేట్‌ను అమ్మా నాన్నలకు అంకితం చేస్తున్నట్లు భావోద్వేగంతో తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి