బట్టలు ఉతికే నీళ్లనే
తాగుతున్నామంటూ గిరిజన బాలికల కంటతడి.
వాష్‌రూమ్‌ల దుస్థితి.. కనీస వసతులు కరువు.
సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థినుల ఆవేదన
వెంకటాపురం: చదువుకోవాల్సిన గిరిజన బాలికలకు కనీస వసతులు కరువయ్యాయి. తాగునీటి కోసం అడిగితే తమను ప్రిన్సిపాల్ కొట్టారని విద్యార్థినులు ఆరోపిస్తూ కంటతడి పెట్టుకున్నారు. బట్టలు ఉతికేందుకు వినియోగించే నీటినే తాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఐటీడీఏ కాలేజీ సమీపంలో ఉన్న గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ దుస్థితి నెలకొందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
నీళ్ల సమస్య తీవ్రం.
పాఠశాలలో తాగునీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు తెలిపారు. నీళ్లు కావాలని అడిగినందుకు ప్రిన్సిపాల్ తమపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. చదువుకోవడానికి వచ్చిన తమతో నీళ్లు మోయిస్తున్నారని, సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపడం లేదని వాపోయారు.
వాష్‌రూమ్‌ల దుస్థితి.
పాఠశాలలోని వాష్‌రూమ్‌లు సైతం అధ్వానంగా ఉన్నాయని విద్యార్థినులు చెబుతున్నారు. వాష్‌రూమ్‌ల నుంచి మురుగునీరు బయటకు పొంగి వస్తోందని, దీంతో తీవ్ర దుర్వాసనతో పాటు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస పారిశుద్ధ్య వసతులు కూడా లేవని తెలిపారు.
సమస్య చెబితే బెదిరింపులా?
తమ సమస్యలను సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆరోపించారు. పైగా సమస్యలు బయటకు చెబితే బెదిరిస్తున్నారని వాపోయారు. ప్రిన్సిపాల్ కూడా అందుబాటులో ఉండరని, కొందరు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు చేశారు.
తల్లిదండ్రుల ఆగ్రహం.
గిరిజన బాలికల కోసం నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలోనే కనీస వసతులు లేకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సీతక్క సొంత జిల్లా ములుగులోనే ఆదివాసీ, గిరిజన బాలికలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం బాధాకరమని వారు అంటున్నారు. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు తక్షణమే పాఠశాలను తనిఖీ చేసి తాగునీరు, పారిశుద్ధ్యం, వాష్‌రూమ్‌లు తదితర మౌలిక వసతులను కల్పించాలని, విద్యార్థినుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి