ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నందున నోటీసులు
చౌటుప్పల్ మండలం నేలపట్లలో ఏడీఓ గోపాల్ చర్యలు
చౌటుప్పల్ మండల పరిధిలోని నేలపట్ల చేనేత వస్త్ర సహకార సంఘం (హ్యాండ్లూమ్ వివర్స్ కోఆపరేటివ్ సొసైటీ) ఎన్నికల ఫలితాలపై కోఆపరేటివ్ ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను అధికారులు మంగళవారం అమలు చేశారు. చేనేత జౌళి శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ సంచాలకుల (ఏడీ) ఆదేశాల మేరకు ఏడీఓ గోపాల్ గ్రామంలోని సొసైటీ భవనానికి నోటీసులు అంటించారు.
ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన పిల్లలమర్రి శ్రీనివాస్‌కు ముగ్గురు సంతానం ఉన్నారని, సొసైటీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు పోటీ చేయడానికి అర్హులు కాదని తెలుపుతూ పలువురు డైరెక్టర్లు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, ఆగస్టు 5న శ్రీనివాస్ ఎన్నిక, అధ్యక్ష నియామకంపై మధ్యంతర స్టే జారీ చేసింది. ట్రిబ్యునల్ స్టే ఆర్డర్‌తో పాటు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నోటీసులను భవనానికి అంటించినట్లు ఏడీఓ తెలిపారు. అంతేకాకుండా, సంబంధిత వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా కూడా నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. క్రిమినల్ కోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా, ట్రిబ్యునల్ స్టే ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని సొసైటీ కార్యదర్శికి సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు గంజి శ్రీనివాసులు, తడక కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి