సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లాలి:
రామన్నపేట, సెప్టెంబర్ 4:
రామన్నపేట ప్రభుత్వ దవాఖానను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని, ఇందుకు అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయించి సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఉద్యమకారుడు కామ్రేడ్ రెబ్బాస్ రాములు డిమాండ్ చేశారు.
75 సంవత్సరాల చరిత్ర కలిగిన రామన్నపేట ప్రభుత్వ దవాఖాన ఇప్పటికీ 10 నుంచి 50 పడకలకే పరిమితమైందని, పాత భవనంలోనే వైద్య సేవలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో వైద్య సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రోజుకు 500 నుంచి 600 మంది వరకు రోగులు వస్తున్నప్పటికీ, సరిపడా వైద్యులు, అన్ని విభాగాల వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులను హైదరాబాద్, నల్లగొండకు తరలించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
రూ.40 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మించాలి.
తెలంగాణతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు చిన్న ఆసుపత్రులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 100 పడకల ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటప్పుడు రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు ఎందుకు అన్యాయం జరుగుతోందని ప్రశ్నించారు.
ఇప్పటికైనా స్థానిక ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రితో మాట్లాడాలని, రూ.40 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేయించాలని మండల ఉద్యమకారుల ఫోరం తరఫున కామ్రేడ్ రెబ్బాస్ రాములు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి