Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 13, 2026 10:46 PM

పంటలు ఎండిపోకుండా అప్రమత్తంగా ఉండాలి: మంత్రులు ఉత్తమ్, తుమ్మల

పంటలు ఎండిపోకుండా అప్రమత్తంగా ఉండాలి: మంత్రులు ఉత్తమ్, తుమ్మల

పంటలు ఎండిపోకుండా అప్రమత్తంగా ఉండాలి: మంత్రులు ఉత్తమ్, తుమ్మల
March 13, 2026 08:37 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

సాగు–తాగునీటిపై ప్రత్యేక నజర్

జూన్ చివరి వరకు నిల్వలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి

నల్లగొండ,: రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో సాగు, తాగునీటి కొరత తలెత్తకుండా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మిర్యాలగూడ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జూన్ చివరి వరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా రిజర్వాయర్లలో తగిన నీటి నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఉదయ సముద్రం ద్వారా నల్లగొండ పట్టణం, పరిసర గ్రామాలకు తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన నిల్వలు ఉండేలా చూడాలని చెప్పారు.

సాగర్ టేలెండ్ పరిధిలో తాగునీటి పరిస్థితిపై క్షేత్రస్థాయి పర్యటన చేసి నివేదిక సమర్పించాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్‌ను ఆదేశించారు. అలాగే ఉదయ సముద్రం కింద సాగవుతున్న పంటల పరిస్థితిని పరిశీలించి కోత దశ వరకు ఎంత నీరు అవసరమో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడా సాగునీరు లేదా విద్యుత్ కొరత కారణంగా పంటలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రాజెక్టుల పరిస్థితిని రెండు మూడు రోజులకు ఒకసారి సమీక్షిస్తూ ఇంజనీర్లు, వ్యవసాయ, విద్యుత్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని తెలిపారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటూ ఇప్పటికే 288 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను సాధించేలా ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించాలని సూచించారు. ప్రాజెక్టుల కింద భూసేకరణ సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించాలని, గుర్తించిన భూములకు సరిహద్దులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్‌తో పాటు ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News