తాగునీరు.. డ్రైనేజీ.. పారిశుధ్యం.. ఫ్లైఓవర్ పూర్తి చేయాలంటూ మహాధర్నా.
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో మౌలిక వసతులు కుంటుపడ్డాయంటూ నేతల ధ్వజం.
చిట్యాల: ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చిట్యాల మున్సిపాలిటీలో ఆదివారం మహాధర్నా నిర్వహించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ఆందోళనకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి:
గ్రామాల్లో తాగునీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అనేక గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్ కోతల కారణంగా సమస్య మరింత తీవ్రమవుతోందని పేర్కొన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు విద్యుత్ సరఫరాను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
మురుగునీరు రోడ్లపైకి.. పారిశుధ్యం అస్తవ్యస్తం:
గ్రామాలు, పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని నేతలు మండిపడ్డారు. మురుగునీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పారిశుధ్య నిర్వహణ లోపంతో దోమల బెడద పెరిగి ప్రజారోగ్యంపై ప్రభావం పడుతోందని అన్నారు. డ్రైనేజీలను పునరుద్ధరించి, పారిశుధ్య పనులను నిరంతరం చేపట్టాలని కోరారు.
లోవోల్టేజీ.. వీధిదీపాల సమస్యలూ పరిష్కరించాలి:
చిట్యాల మున్సిపాలిటీలో నెలకొన్న లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. పలు ప్రాంతాల్లో వీధిదీపాలు పనిచేయక రాత్రివేళ ప్రజలు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అవసరమైన చోట కొత్త వీధిదీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.
ఫ్లైఓవర్ ఎప్పుడు పూర్తవుతుంది?
చిట్యాల మీదుగా సాగుతున్న జాతీయ రహదారి పనులు, అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ పనులు పూర్తికాకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, సర్వీస్ రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. హైవే, ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేసి ప్రజలకు సురక్షితమైన రాకపోకలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉద్యమం ఉధృతం చేస్తాం:
తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధిదీపాలు, ఆరోగ్యం వంటి కనీస మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహాధర్నాలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి