నాగార్జునసాగర్ జలాశయంలో నల్లటి నీటి కలకలం... విషతుల్యమవుతున్న కృష్ణా జలాలు.?
నాగార్జునసాగర్: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పారిశ్రామిక వ్యర్థాలు జలాల్లో కలవడంపై తీవ్ర కలకలం రేగుతోంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోని నీరు హఠాత్తుగా నల్లటి రంగులోకి మారడంతో స్థానిక ప్రజలు, ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ నగరానికి ప్రధాన తాగునీటి ఆధారమైన సాగర్ జలాశయం కలుషితం కావడం వల్ల ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పారిశ్రామిక వ్యర్థాల రసాయనాల ముప్పు...
ఎగువ ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమల నుంచి రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలు కృష్ణా నదిలోకి నేరుగా వదులుతుండడమే ఈ రంగు మార్పునకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాగర్ ఎడమ కాల్వ ద్వారా ఈ కలుషిత నీరు ప్రవహిస్తుండడంతో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని సుమారు 800 చెరువులు, కుంటలు కలుషితమయ్యే ప్రమాదం ఏర్పడింది. సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన నాటి నుంచి ఇప్పటివరకు ఇలాంటి విచిత్రమైన, ఆందోళనకరమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని ఆయకట్టు రైతాంగం చెబుతోంది.
రంగంలోకి నీటిపారుదల శాఖ అధికారులు...
కలుషిత నీటి వ్యవహారం పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూడడంతో నీటిపారుదల (ఇరిగేషన్) శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. హిల్ కాలనీ ఇరిగేషన్ సర్కిల్ డ్యామ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో అధికారులు, ఫీల్డ్ సిబ్బందితో కలిసి సాగర్ రిజర్వాయర్‌లోని ‘దయ్యాలగండి’ ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. నీటి రంగు మారడానికి గల ప్రాథమిక కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. జలాశయం నుంచి వివిధ ప్రాంతాల్లో నీటి శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. ఎగువన నీరు ఎక్కడెక్కడ కలుషితమవుతోంది, రసాయనాలు ఏ పరిశ్రమల నుంచి విడుదలవుతున్నాయనే అంశాలపై సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు.
ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం?
హైదరాబాద్ నగరంతో పాటు మూడు జిల్లాలకు తాగునీటి సరఫరా నిలిచిపోతుందేమోనన్న భయం ప్రజల్లో నెలకొంది. నీరు కలుషితమైతే రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల, కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) అధికారులు తక్షణమే స్పందించి, అసలు నీరు నల్లగా మారడానికి గల కచ్చితమైన కారణాలను తేల్చాలని, బాధ్యులైన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ప్రాజెక్ట్ నీటి నాణ్యతను కాపాడేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు చేపడతారో వేచి చూడాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి