సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ.. అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలి.
రంగారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 5: చేయూత పెన్షన్ పథకం కింద కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. కొత్త దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ డేటా ఎంట్రీ, ధ్రువీకరణకు సంబంధించి పలు మార్పులు చేసినట్లు వెల్లడించారు.
ఒంటరి మహిళల పెన్షన్‌కు సంబంధించి లోకల్ ఎంక్వైరీ రిపోర్టు (LER)ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి కాదన్నారు. వితంతు పెన్షన్ దరఖాస్తుదారులు మరణించిన భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. దివ్యాంగుల పెన్షన్‌కు SADAREM/UDID ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేయడం కూడా తప్పనిసరి కాదని తెలిపారు.
ఆన్‌లైన్‌లో నమోదైన కొత్త పెన్షన్ దరఖాస్తుల వివరాలను ప్రజలు తెలుసుకునేందుకు సెర్చ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో పెన్షన్ మంజూరై, వివిధ కారణాలతో నిలిచిపోయిన వారు ప్రస్తుతం లైవ్ పెన్షనర్ కాకపోతే కొత్త దరఖాస్తు ద్వారా తిరిగి నమోదు చేసుకోవచ్చన్నారు.
కల్లుగీత కార్మికులు ‘ట్రీ ఫర్ ట్యాపర్’ ధ్రువీకరణ పత్రం/గుర్తింపు కార్డు, చేనేత కార్మికులు ఏడీ హ్యాండ్లూమ్స్ జారీ చేసిన ధ్రువీకరణ పత్రం/గుర్తింపు కార్డును సమర్పించాలని సూచించారు. ఆన్‌లైన్ డేటా ఎంట్రీ సమయంలో ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేయలేకపోతే.. దరఖాస్తు పరిశీలన సమయంలో సంబంధిత అధికారికి సమర్పించవచ్చన్నారు.
అర్హులైన ప్రజలు సెప్టెంబర్ 15లోపు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మరిన్ని వివరాలకు 9247524051 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి