మంత్రి సురేఖ రాఖీ కట్టడంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని చెల్లిని బయటకు నెట్టారు...
కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సీఎం...
నల్లగొండ: మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టిన అంశంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు సంస్కారం ఉంది కాబట్టే రాఖీ పండుగ రోజున తన ఇంటికి వచ్చిన ప్రజాప్రతినిధులు కొండా సురేఖ, సీతక్కలను ఆదరించి, స్వీట్లు తినిపించి మర్యాదలు చేశానని తెలిపారు. రాఖీ కట్టేందుకు వచ్చిన ఆడబిడ్డలను గౌరవించడమే తమ సంస్కారమని పేర్కొన్నారు.
కేటీఆర్‌కు ఏం సంస్కారం ఉంది?
ఇదే సమయంలో బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌కు సంస్కారం ఉందా అని ప్రశ్నిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేపటి రోజున ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే నెపంతో తోడబుట్టిన చెల్లిని మెడ పట్టుకుని బయటకు నెట్టేసిన చరిత్ర కేటీఆర్‌దని ఆరోపించారు. కేటీఆర్ ప్రవర్తనను తప్పుబడుతూ ఆయనను ‘గాడిద’, ‘నీచుడు’, ‘నికృష్టుడు’ అంటూ తీవ్ర పదజాలంతో విమర్శించారు. "నీతో నాకు పోలికా?" అని కేటీఆర్‌ను ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, నాలుగు ఇంగ్లిష్ ముక్కలు మాట్లాడటం వచ్చంత మాత్రాన గొప్పవాడివి అయిపోతావా అంటూ ఎద్దేవా చేశారు. ప్రజాసేవలో, సంస్కారంలో తమకు, కేటీఆర్‌కు నక్కకూ నాకలోకానికి ఉన్నంత తేడా ఉందని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి