జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సరస్వతికి పురస్కారం
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులు: ప్రిన్సిపల్ శివస్వరూప రాణి
చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లక్కారం ఆదర్శ మోడల్ స్కూల్‌లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ శివస్వరూప రాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాలలో సేవలందిస్తున్న ఉపాధ్యాయురాలు సరస్వతి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక కావడంపై ప్రిన్సిపల్ శివస్వరూప రాణి ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య అందిస్తూ, విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో ఆమె చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. సరస్వతి సాధించిన ఈ ఘనత పాఠశాల సిబ్బందికి, విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలను దిద్దితీర్చడంలో గురువుల పాత్ర అత్యంత కీలకమైందని తెలిపారు. కేవలం పాఠ్యాంశాలే కాకుండా క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను విద్యార్థుల్లో పెంపొందించాలని పిలుపునిచ్చారు. తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలు, సృజనాత్మకతకు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయురాలు సరస్వతిని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి