ప్రభుత్వ పాఠశాల ప్రతిష్ఠకు భంగం.. హెడ్‌మాస్టర్‌తో పాటు నలుగురు టీచర్లు సస్పెండ్ జీరో ఎన్‌రోల్‌మెంట్‌పై కలెక్టర్, డీఈవో ఆగ్రహం – విచారణలో సంచలన అంశాలు
ప్రభుత్వ పాఠశాల ప్రతిష్ఠకు భంగం.. హెడ్‌మాస్టర్‌తో పాటు నలుగురు టీచర్లు సస్పెండ్ జీరో ఎన్‌రోల్‌మెంట్‌పై కలెక్టర్, డీఈవో ఆగ్రహం – విచారణలో సంచలన అంశాలు
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్లకు మళ్లించారనే ఆరోపణలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థుల చేరికలను పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్న తరుణంలో కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి వెలుగులోకి వచ్చింది. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ పాఠశాల ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బండరామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్) హెడ్‌మాస్టర్‌తో పాటు మరో నలుగురు ఉపాధ్యాయులను జిల్లా యంత్రాంగం సస్పెండ్ చేసింది. ఈ ఘటన జిల్లా విద్యాశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ విద్యా సంవత్సరంలో బండరామారం జెడ్పీహెచ్‌ఎస్‌లో ఒక్క కొత్త విద్యార్థి కూడా చేరకపోవడం అధికారులను అప్రమత్తం చేసింది. పాఠశాలలో "జీరో ఎన్‌రోల్‌మెంట్" నమోదవడాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. దీనికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించడంతో సంబంధిత అధికారులు పాఠశాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.
విచారణలో పలు సంచలన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలలో చేరాల్సిన విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించేలా కొందరు ఉపాధ్యాయులే పరోక్షంగా ప్రోత్సహించినట్లు ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా తాము పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలపై తప్పుడు ప్రచారం నిర్వహించి, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై అపోహలు కలిగించే ప్రయత్నం చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో చులకన భావన ఏర్పడేలా వ్యవహరించడం, విద్యార్థుల చేరికలను నిరుత్సాహపరచడం వంటి చర్యలు ప్రభుత్వ విధానాలకు పూర్తిగా విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి పథకాలను అమలు చేస్తున్న సమయంలో ఉపాధ్యాయులే ప్రభుత్వ పాఠశాల ప్రతిష్ఠను దెబ్బతీయడం అత్యంత బాధాకరమని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో హెడ్‌మాస్టర్‌తో పాటు నలుగురు ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచడం, నాణ్యమైన విద్య అందించడం ప్రతి ఉపాధ్యాయుడి బాధ్యత అని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలను ఏ మాత్రం సహించబోమని హెచ్చరిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఘటన ప్రభుత్వ విద్యా వ్యవస్థలో బాధ్యతాయుతమైన విధుల నిర్వహణపై మరోసారి చర్చకు దారితీసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి