ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్యమే లక్ష్యం..
ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్యమే లక్ష్యం..
NM Yadav
నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, మాన్యం చెల్క యూపీహెచ్‌సీల ఆకస్మిక తనిఖీ..
రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీసిన జిల్లా ప్రత్యేక అధికారి గౌరవ్ ఉప్పల్..
నల్లగొండ : ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి సర్కారు వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, నల్లగొండ జిల్లా 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లాలో 99 రోజుల ప్రగతి కార్యాచరణ ప్రణాళిక అమలుపై సమీక్ష నిమిత్తం వచ్చిన ఆయన.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని (జీజీహెచ్) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన.. అందుతున్న సౌకర్యాలపై బెడ్‌ల వద్దకు వెళ్లి నేరుగా రోగులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విభాగాల వారీగా ముమ్మర తనిఖీలు..
ఈ-ఔషధి మెడిసిన్ కౌంటర్లు, టీ-హబ్ డయాగ్నస్టిక్ ల్యాబ్, రేడియాలజీ, మేల్ సర్జికల్ వార్డు, ఐసీయూ (తీవ్ర నిఘా విభాగం), సీటీ స్కాన్ తదితర విభాగాలను ప్రత్యేక అధికారి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆయా యంత్రాల పనితీరును, రోగుల రికార్డులను పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌ను సందర్శించి మందుల నిల్వలు, సరఫరా రిజిస్టర్లను తనిఖీ చేశారు.
ప్రభుత్వానికి సమగ్ర నివేదిక, సమస్యల పరిష్కారానికి హామీ..
ఈ సందర్భంగా గౌరవ్ ఉప్పల్ మీడియాతో మాట్లాడుతూ.. తాను టీజీఎంఎస్ఐడీసీ (తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నందున ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు, మందుల కొరత లేకుండా చూసేందుకు ఈ తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ ఆసుపత్రికి కొత్తగా ఎంఆర్ఐ (MRI) స్కానింగ్ యంత్రం కావాలని ఇక్కడి వైద్యులు కోరారు. ప్రస్తుతం ఉన్న సీటీ స్కాన్ యంత్రానికి స్వల్ప మరమ్మతులు అవసరమని నా దృష్టికి వచ్చింది. వీటిపై జిల్లా కలెక్టర్ నుంచి తక్షణమే నివేదిక తెప్పించుకుని, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాం. ఆసుపత్రి అవసరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పిస్తాం.
పట్టణ ఆరోగ్య కేంద్రంలో తనిఖీ నివేదికకు ఆదేశం..
అనంతరం ఆయన పట్టణంలోని మాన్యం చెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (UPHC) ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ నమోదవుతున్న ఓపీ (OP) వివరాలను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫిరధౌసిని అడిగి తెలుసుకున్నారు. ఈ-ఆరోగ్యం, హెచ్ఎంఎస్ (హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్), ఈ-ఔషధ సాఫ్ట్‌వేర్ల ద్వారా రోగులకు అందిస్తున్న సేవల డేటా ఎంట్రీని, మందుల పంపిణీ రికార్డులను ఫార్మసిస్ట్‌తో కలిసి పరిశీలించారు. ఈ మూడు డిజిటల్ సేవల పనితీరుపై పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని మెడికల్ ఆఫీసర్‌ను ఆదేశించారు. ఈ తనిఖీల్లో ప్రత్యేక అధికారి వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ రాహుల్, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి