Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశ్వకర్మ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 01:34 AM

నల్లగొండ ప్రగతి పథంలో సర్వతోముఖాభివృద్ధే నా ధ్యేయం..మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ ప్రగతి పథంలో సర్వతోముఖాభివృద్ధే నా ధ్యేయం..మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ ప్రగతి పథంలో సర్వతోముఖాభివృద్ధే నా ధ్యేయం..మంత్రి కోమటిరెడ్డి
June 02, 2026 01:37 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav


అమరుల త్యాగాల ఫలమే నేటి తెలంగాణ..

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే మన జిల్లా నంబర్ వన్..

రూ.1,457 కోట్లతో రహదారుల విస్తరణ సాగర్ ఎడమ కాలువకు రూ.54 కోట్లు..

రాష్ట్ర అవతరణ వేడుకల్లో రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

నల్లగొండ : నల్లగొండ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో అమరవీరుల త్యాగఫలితంగానే నాలుగు కోట్ల ప్రజల ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందన్నారు. నల్లగొండ జిల్లా విప్లవాల పురిటిగడ్డ అని, సాయుధ పోరాటం నుంచి మలిదశ ఉద్యమం వరకు ఈ గడ్డ సింహభాగం పాత్ర పోషించిందని కొనియాడారు. నాడు తెలంగాణ ఆకాంక్ష కోసం తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా విసిరికొట్టి, ఆమరణ నిరాహార దీక్షకు దిగిన చరిత్ర తనదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందని, జిల్లాను అభివృద్ధి, సంక్షేమంలో అగ్రభాగాన నిలబెట్టే బాధ్యత తనదని స్పష్టం చేశారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు జరుగుతున్న 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికా' కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సాధించిన వివిధ శాఖల ప్రగతి వివరాలను మంత్రి వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ప్రజా సంక్షేమ పథకాల ప్రగతి ప్రస్థానం..

మహాలక్ష్మి & గ్యాస్ సబ్సిడీ పధకాలతో  జిల్లాలో మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 10.83 కోట్ల ఉచిత ప్రయాణాల ద్వారా రూ.508.85 కోట్ల లబ్ధి చేకూరింది. అలాగే రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకం కింద 2,52,963 మంది లబ్ధిదారులకు రూ.44.12 కోట్ల సబ్సిడీ అందించాం. ​ధాన్య సేకరణలో జిల్లా ప్రథమ స్థానం, యాసంగి (2025-26) సీజన్ లో క్వింటాకు రూ.2,389 మద్దతు ధర చెల్లించి, 459 కేంద్రాల ద్వారా 7,24,033 మెట్రిక్ టన్నుల ధాన్ని సేకరించి నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపాం. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే 78,650 మంది రైతుల ఖాతాల్లో రూ.1,223.88 కోట్లు జమ చేశాం. ​రైతు భరోసా & రుణమాఫీ పథకాలతో పాటు, రైతు భరోసా కింద వానాకాలం, యాసంగి సీజన్లలో వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయబడ్డాయి. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద 2,33,981 మంది రైతులకు రూ.2,004.83 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే 2,51,117 మంది వినియోగదారులకు జీరో బిల్లులు జారీ చేశాం. దీనికోసం ప్రభుత్వం రూ.184.40 కోట్ల సబ్సిడీ భరించింది. మొదటి విడతలో జిల్లాకు 18,837 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.275 కోట్లు లబ్ధిదారులకు చెల్లించాం. ఇప్పటికే 2,067 గృహాలు పూర్తి కాగా, రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి మరో 2,000 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నాం.

ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణమే లక్ష్యం..

నాగార్జునసాగర్ ఎడమ కాలువ లైనింగ్ పనులకు రూ.54 కోట్లు, AMR SLBC ప్రాజెక్టు పనులకు హై-లెవల్ కింద రూ.444 కోట్లు, లో-లెవల్ కింద రూ.52 కోట్లు మంజూరు చేసి పనులు వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెడ్ రీచ్ పనులకు రూ.1,800 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. రహదారుల విషయానికొస్తే.. హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (HAM) కింద జిల్లాలో ఫేజ్-1 పరిధిలో 532.05 కి.మీ రహదారుల వెడల్పు పనులకు రూ.1,457.66 కోట్లు, ప్లాన్ నిధుల కింద రూ.949.95 కోట్లు, నల్లగొండ పట్టణంలో ఘాట్ రోడ్డు నిర్మాణానికి రూ.140 కోట్లు మంజూరై పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.

విద్య, వైద్య రంగాలకు పెద్దపీట..

​రూ.20 కోట్లతో నల్లగొండ ఐటిఐ ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించామని, ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల' నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తెలిపారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచే బి.ఫార్మసీ, లా కాలేజీ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం వల్ల జిల్లాలో 11,388 మంది లబ్ధి పొందారని, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఉన్నతీకరణకు రూ.32.85 కోట్లు, నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు రూ.40 కోట్లు మంజూరు చేశామన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో 4 యూనిట్ల నిర్మాణం పూర్తయి రోజుకు 76.8 మిలియన్ యూనిట్ల వాణిజ్య విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని, మిగిలిన ఒక యూనిట్ పనులు ఈ ఏడాది జూలై నాటికి పూర్తవుతాయని వివరించారు.

శకటాల ప్రదర్శన, అవార్డుల ప్రదానం..

​వేడుకల్లో భాగంగా సమాచార, వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమం, రవాణా, అగ్నిమాపక, డిఆర్డిఏ, గృహ నిర్మాణ శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన ప్రగతి శకటాల ప్రదర్శనను మంత్రి తిలకించారు. అనంతరం తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను, పోలీస్ సేవ పతకాలను అందజేశారు. చండూరు మండలం ఉడతలపల్లికి చెందిన కొరివి శ్రీదేవి-శివ దంపతులకు ఇందిరమ్మ ఇంటి పట్టా, గృహపత్రాన్ని అందజేశారు. మెప్మా ద్వారా లబ్ధిదారులకు రూ.6 కోట్ల 46 లక్షల 50 వేల రూపాయల చెక్కుతో పాటు, స్వయం సహాయక మహిళా సంఘాలకు స్త్రీనిధి రుణాలను పంపిణీ చేశారు. వేసవి శిబిరం నిర్వహణలో ఉత్తమంగా నిలిచిన జెడ్‌పీహెచ్ఎస్ కట్టంగూరు, టీజీఎంఎస్ నిడమనూరు, టీజీఎంఎస్ మిర్యాలగూడ విద్యార్థులకు జ్ఞాపికలు బహుకరించారు. బాల భవన్ నాగార్జునసాగర్ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, స్థానిక కార్పొరేటర్ కవిత, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News