ఒక మహిళపై అసభ్యకర మాటలతో వేధింపుల నుంచి సాదాబైనామా లంచాల వరకు డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌శేఖర్ బాగోతాలు...
ఈడబ్ల్యూఎస్ దరఖాస్తుదారుపై వెకిలి వ్యాఖ్యలు... ఇతరుల సమక్షంలో కుటుంబ వ్యవహారాలపై వ్యంగ్యాస్త్రాలు...
రంగంలోకి దిగి ఆకస్మిక తనిఖీ చేపట్టిన ట్రైనీ కలెక్టర్...
జిపిఓ లచ్చయ్య సరెండర్, డి టి పై విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు ఫిర్యాదు చేసిన ట్రైని కలెక్టర్...
నల్గొండ : నల్గొండ మండల తహసీల్దార్ కార్యాలయం అక్రమాలకు, అవినీతికి, అధికారుల నియంతృత్వ వైఖరికి నిలయంగా మారింది. ‘ఫ్యామిలీ మెంబర్‌షిప్’ సర్టిఫికెట్ కోసం వచ్చిన ఓ మహిళపై డిప్యూటీ తహసీల్దార్ (నాయబ్ తహసీల్దార్) విజయ్‌శేఖర్ అసభ్యకర మాటలతో వేధింపులకు పాల్పడిన వ్యవహారం కలకలం రేపిన మరుసటి రోజే, అదే అధికారికి సంబంధించిన మరిన్ని అవినీతి, అవమానకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు ఏకంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలసి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఆఫీసులోని అక్రమాల డొంకంతా ఒక్కొక్కటిగా బయటపడుతోంది.
ఈడబ్ల్యూఎస్ దరఖాస్తుదారుపై ‘వెకిలి’ వ్యాఖ్యలు...
ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఒక యువతి పట్ల సదరు నాయబ్ తహసీల్దార్ అత్యంత అభ్యంతరకరంగా వ్యవహరించిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో ఆమె తన తల్లి ఆదాయ వివరాలను సమర్పించగా.. నిబంధనలతో సంబంధం లేకుండా ఇతరుల సమక్షంలో వ్యక్తిగత విషయాలపై వెకిలి ప్రశ్నలు వేసినట్లు,"మీ తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? నేను ఒక వ్యక్తిని పంపి మీ తండ్రిని కొట్టిస్తే ఆపుతారా? వదిలేస్తారా?" అంటూ హింసాత్మకమైన వ్యాఖ్యలు చేశారని, అంతేకాకుండా, మరుసటి రోజు కార్యాలయంలో అందరి ముందూ "మనోడు మంచి తాగుబోతు, పిల్లలు పెళ్లాం అంటే లెక్కలేదు" అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆ తర్వాత ఆమె సమర్పించిన దరఖాస్తును సరైన కారణం లేకుండానే తిరస్కరించారు. ఈ అవమానకర ప్రవర్తనపై నిష్పక్షపాత విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు జిల్లా కలెక్టర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
సాదాబైనామాకు ‘నజరానా’ ఇస్తేనే పని...
మండలంలోని సందెనపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమిని క్రమబద్ధీకరించాలని (అప్రూవల్) కోరుతూ దరఖాస్తు చేసుకోగా, డిటి విజయ్‌శేఖర్ భారీగా లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.ఈ కార్యాలయంలో పనిచేసే జిపిఓ లచ్చయ్య ద్వారా డబ్బులు పంపాలని ఒత్తిడి తెచ్చారంటూ.. "ఈ ఆఫీసులో పనిచేసే జిపిఓలందరూ నేను చెప్పినట్లే వింటారు.. లంచం ఇవ్వందే ఇక్కడ ఏ పని జరగదు" అంటూ హుకుం జారీ చేయడంతో బాధితుడు విస్తుపోయి ఆధారాలతో సహా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ట్రైనీ కలెక్టర్ ఆకస్మిక విచారణ విజిలెన్స్‌కు సిఫార్సు...
వరుస ఫిర్యాదులపై తీవ్రంగా స్పందించిన జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గత మంగళవారం తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన ట్రైనీ కలెక్టర్ దస్త్రాలను, సిబ్బంది తీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆరోపణల్లో నిజముందని నిర్ధారించుకున్న అనంతరం, డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌శేఖర్, జిపిఓ లచ్చయ్యలపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేశారాని రెవెన్యూ అధికారులు తెలిపారు . ఈ ఆదేశాల నేపథ్యంలో జిపిఓ లచ్చయ్యను ఎమ్మార్వో తక్షణమే సరెండర్ చేశారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌శేఖర్‌పై ట్రైని కలెక్టర్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు స్వయంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఒకే అధికారిపై వరుసగా వేధింపుల ఆరోపణలు, బాధితుల పట్ల అవమానకర ప్రవర్తన, బహిరంగ అవినీతి బాగోతాలు బయటపడటంతో రెవెన్యూ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. బాధ్యుడైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విధుల నుండి సస్పెండ్ చేయాలని స్థానిక ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి