Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 03:13 AM

మహిళలు ఆర్థికంగా ఎదగాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

మహిళలు ఆర్థికంగా ఎదగాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

మహిళలు ఆర్థికంగా ఎదగాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
March 14, 2026 06:16 PM 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

మహిళా సంఘాలకు పాఠశాల యూనిఫాంల తయారీ బాధ్యత..

​నల్గొండ, మహా : మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సెట్విన్ (SETWIN) సంస్థలో శిక్షణ పూర్తి చేసుకున్న 116 మంది మహిళలకు ఆయన కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఖాలీగా ఉండొద్దు స్వయం ఉపాధి పొందండి..

​మహిళలు ఇంట్లోనే పరిమితం కాకుండా పట్టుదలతో ఏదో ఒక పనిలో నైపుణ్యాన్ని నేర్చుకోవాలని మంత్రి సూచించారు. నల్గొండ సెట్విన్ సంస్థను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటి వరకు ఇక్కడ 27 కోర్సుల్లో 1250 మందికి శిక్షణ ఇచ్చాం. శిక్షణ పొందిన వారు మహిళా సంఘాలుగా ఏర్పడితే ప్రభుత్వం నుంచి రుణాలు ఇప్పిస్తాం. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాంలను కుట్టే బాధ్యతను కూడా ఈ సంఘాలకే అప్పగిస్తాం అని వెల్లడించారు. జిల్లాలో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, నూతన కలెక్టరేట్ నిర్మాణాలు జరుగుతున్నాయని ఇవి పూర్తయితే ఎలక్ట్రిషియన్, ప్లంబింగ్ వంటి కోర్సులు చేసిన వారికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. కంప్యూటర్ శిక్షణ పొందిన మహిళలను ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లుగా నియమిస్తామన్నారు.

రెండు దశల్లో మూసీ ప్రక్షాళన..

​అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మూసీ నది కాలుష్యం వల్ల జిల్లాలోని 30 లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే మూసీ ప్రక్షాళన పనులు చేపడతామని మొదటి దశలో 21 కి.మీ, రెండో దశలో మరో 21 కి.మీ మేర పనులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. డిండి ప్రాజెక్టు పనులను కూడా వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన గుర్తు చేశారు.


ఏడాదికి 25వేల మందికి శిక్షణ.. సెట్విన్ చైర్మన్

​సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. నైపుణ్యాభివృద్ధిని జిల్లాలకు విస్తరించామని, ఏటా 25 వేల మందికి శిక్షణ ఇవ్వడమే తమ లక్ష్యమని తెలిపారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మహిళలు బ్యాంక్ రుణాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు. ఈవీ వాహనాలు, ఆటో ట్రాలీ రంగాల్లో భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, సెట్విన్ ఎం.డి ఉపేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఆఫీస్ ఖాన్, సెట్విన్ ప్రిన్సిపాల్ రేణుక తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News