కన్నతల్లిని, కళ్లులేని అన్నను కాటేసిన కనికరం లేని చెల్లి!
కన్నతల్లిని, కళ్లులేని అన్నను కాటేసిన కనికరం లేని చెల్లి!
K.RAVI
- మాయమాటలతో అంధ దంపతుల భూమి కాజేసిన వైనం
- నకిలీ పత్రాలతో తల్లి ఇల్లు కూడా రిజిస్ట్రేషన్
- బాధితులకు మద్దతుగా అంధుల సంఘాల ధర్నా
రక్తసంబంధం కళ్లముందే మోసం చేసింది. అండగా ఉండాల్సిన చెల్లి, అంధుడైన అన్న ఆస్తిపై కన్నేసి కోట్లు విలువచేసే భూమిని కాజేసింది. అంతటితో ఆగక కన్నతల్లి ఉంటున్న ఇంటిని కూడా నకిలీ పత్రాలతో తన పేరిట రాసుకుని, వృద్ధురాలని చూడకుండా బయటకు గెంటివేస్తున్న అమానుష ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెంలో వెలుగుచూసింది.
నమ్మించి గొంతు కోశారు..
గ్రామానికి చెందిన కుంట్ల రాజిరెడ్డి, జ్యోతి దంపతులు ఇద్దరూ అంధులు. వీరికి తండ్రి నుంచి సంక్రమించిన నాలుగు ఎకరాల భూమి ఉంది. వీరి నిస్సహాయతను ఆసరాగా చేసుకున్న రాజిరెడ్డి సోదరి, మసీదుగూడెంకు చెందిన ఆకిటి మంజుల, ఆమె భర్త సత్తిరెడ్డి.. అన్నపై ప్రేమ కురిపిస్తున్నట్లు నటిస్తూ నెమ్మదిగా నాలుగున్నర ఎకరాల భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
నకిలీ పత్రాలతో ఇంటి కబ్జా
భూమిని కాజేయడమే కాకుండా, తల్లి కుంట్ల సత్తమ్మ నివాసముంటున్న ఇంటిపై కూడా మంజుల కన్ను పడింది. అధికారుల సహకారంతో నకిలీ పత్రాలు సృష్టించి, తల్లికి, అన్నలకు తెలియకుండానే ఇంటిని తన పేరు మీద మార్చుకుంది. ఇప్పుడు ఆ వృద్ధురాలిని ఇల్లు ఖాళీ చేయాలంటూ భర్త, కుమారులతో కలిసి బెదిరింపులకు గురిచేస్తోంది. తమకు జరిగిన అన్యాయంపై బాధితులు ఆదివారం నిందితురాలి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బాధితులకు మద్దతుగా నల్గొండ జిల్లాకు చెందిన అంధుల సంఘం నాయకులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అంధులను, వృద్ధురాలని మోసం చేసిన మంజులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన భూమిని, ఇంటిని బాధితులకు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కుంట్ల వెంకట్ రెడ్డి, మాధవరెడ్డి, సుష్మా రెడ్డి, సుధాకర్ రెడ్డి, సుర్కంటి భూపాల్ రెడ్డి, గుర్రం ప్రసాద్ రెడ్డి, కుంట్ల శివారెడ్డి, కంకల శ్రీకాంత్, నల్గొండ బ్లైండ్ యూనియన్ క్రాంతి, సైదా వలి, వెంకన్న తదితరులు మద్దతు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి