జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ బడులను పెంచాలి..
జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ బడులను పెంచాలి..
NM Yadav
అక్రమ డిప్యుటేషన్లను సహించేది లేదు..
పూర్వ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్..
ఘనంగా టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం..
నల్లగొండ : పట్టణీకరణ పారిశ్రామీకరణ కారణంగా నగరాలు, పట్టణాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో.. అక్కడ పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను పెంచాలని పూర్వ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలోని యుటిఎఫ్ భవన్ లో సంఘం జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాసా చారి అధ్యక్షతన టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్‌మెంట్) పెంచడానికి యుటిఎఫ్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాజకీయ పార్టీల మౌనం సరికాదు..
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. నేడు అధికార, ప్రతిపక్షాల్లో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రభుత్వ పాఠశాలల మూతపై నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి యువ దంపతులు పట్టణాలకు వలస వెళ్తున్నారని, అందుకు తగ్గట్టుగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, చండూరు వంటి పట్టణ ప్రాంతాల్లో మరిన్ని కొత్త ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. నల్లగొండ పట్టణంలో సుమారు 44 వేల మంది విద్యార్థులు చదువుతుంటే, అందులో కేవలం 5,000 మంది మాత్రమే ప్రభుత్వ బడుల్లో ఉండటం ఆలోచించాల్సిన విషయం. పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను ఏ విధంగానైతే మోడల్‌గా అభివృద్ధి చేశారో అదే తరహాలో కేశరాజుపల్లి, రామగిరి, జేబీఎస్, అక్కలాయిగూడెం పాఠశాలలను కూడా అభివృద్ధి చేయాలి. దీనివల్ల ఆర్థికంగా వెనకబడిన, మధ్యతరగతి వర్గాల పిల్లలకు ఎంతో మేలు జరుగుతుంది. దీనిపై స్థానిక మంత్రి ప్రత్యేక చొరవ చూపాలి.
విద్యార్థుల కోసమే సర్దుబాటు వ్యక్తిగత ప్రయోజనాలకు కాదు..
టీచర్ల డిప్యుటేషన్ల దుమారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు. ఉపాధ్యాయుల సర్దుబాటు అనేది కేవలం విద్యార్థుల సౌకర్యార్థం మరియు అవసరం మేరకే జరగాలని, కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే అశాస్త్రీయ డిప్యుటేషన్లను పూర్తిగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కూడా విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోటకే ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చేయించినట్లు గుర్తుచేశారు. అక్రమ డిప్యుటేషన్లపై టీఎస్ యుటిఎఫ్ గట్టి పోరాటం చేస్తుందని, అవసరమైతే ప్రజలను సమీకరించి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
పీఆర్‌సీ ప్రకటించాలి హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలి..
సమావేశంలో పాల్గొన్న టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులు (యూనిఫార్మ్స్), ప్రభుత్వం నాడు వాగ్దానం చేసిన విధంగా షూస్‌తో కూడిన కిట్లను అందించాలన్నారు. నల్లగొండ జిల్లాకు మంజూరైన 124 ప్రీ-ప్రైమరీ సెక్షన్లకు అవసరమైన ఇన్‌స్ట్రక్టర్లు, ఆయా పోస్టులను తక్షణమే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం 'హెల్త్ కేర్ ట్రస్ట్' ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేయాలని, కొత్త పీఆర్‌సీ (PRC) నివేదికను తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
జూలైలోనే బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలి..
మరో రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను జూలై నెలలోనే చేపట్టాలని కోరారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ ఎంఈఓ (MEO), డిప్యూటీ డీఈఓ, డీఈఓ (DEO) పోస్టులను భర్తీ చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒకేసారి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో టీఎస్ యుటిఎఫ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని స్పష్టం చేశారు.ఈ మహాసభల్లో రాష్ట్ర పూర్వ కార్యదర్శి జి. నాగమణి, ఎడ్ల సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జి. అరుణ, జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, శ్రీనివాస్ రెడ్డి, నలపరాజు వెంకన్న, ఆడిట్ కమిటీ సభ్యులు భాను ప్రకాష్, మధుసూదన్, వివిధ కమిటీల కన్వీనర్లు పగిడిపాటి నరసింహ, ప్రభాకర్, బి. సురేందర్ రెడ్డి, ఎరనాగుల సైదులు, శ్యాం కుమార్, శ్రీలత, వరలక్ష్మి, రాగి రాకేష్ మరియు వివిధ మండలాల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి