17న జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..
17న జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..
NM Yadav
రూ. 14,000 కోట్లతో ‘హ్యామ్’ రోడ్ల పనులకు శంకుస్థాపన..
కనగల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ..
ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 17వ తేదీన నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో రహదారుల రూపురేఖలను మార్చేలా.. రూ. 14,000 కోట్ల భారీ వ్యయంతో ‘హ్యామ్’ (HAM) పద్ధతిలో చేపట్టనున్న డబుల్ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా కనగల్ మండల కేంద్రంలో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనగల్‌లో సీఎం సభా స్థలి, హెలిప్యాడ్, పైలాన్ నిర్మాణ స్థలాలను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు.
తొలి ప్యాకేజీ దర్వేశీపురం నుంచే..
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 17న మధ్యాహ్నం ముఖ్యమంత్రి జిల్లాకు చేరుకుంటారని తెలిపారు. ఆర్అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6,300 కిలోమీటర్ల మేర రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చేందుకు 34 ప్యాకేజీలను సిద్ధం చేశామన్నారు. అందులో మొదటి ప్యాకేజీ అయిన ‘కనగల్ మండలం దర్వేశీపురం - డిండి’ రహదారి పనులకు ఇక్కడి నుంచే సీఎం చేతులమీదుగా శంకుస్థాపనలు చేయిస్తున్నట్లు వెల్లడించారు. రహదారులు బాగుంటేనే పరిశ్రమలు, సంక్షేమం వస్తాయి. అందుకే గడిచిన ఏడాది కాలంగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి, రిజర్వ్ బ్యాంక్ ద్వారా అప్పుగా నిధులు సేకరించి ఈ ప్రాజెక్టును చేపట్టాం. రెండేళ్లలోనే హ్యామ్ రోడ్లన్నింటినీ పూర్తి చేస్తాం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో మరో రూ. 7,000 కోట్లతో గ్రామాల నుంచి మండలాలకు డబుల్ రోడ్లు నిర్మిస్తాం. వీటికి వచ్చే వారం డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సమక్షంలో సీఎం శంకుస్థాపన చేస్తారు. జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన ఎస్ఎల్‌బీసీ (SLBC) సొరంగం ప్రాజెక్టును హ్యామ్ రోడ్లు పూర్తయ్యేలోగా.. అంటే 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి దీమా వ్యక్తం చేశారు. దీని ద్వారా జిల్లాలో రెండు పంటలకు సాగునీరు అందుతుందని, ఇది తన కలల ప్రాజెక్టు అని పేర్కొన్నారు. వీటితో పాటు రూ. 450 కోట్లతో మంజూరైనా ఏఆర్‌పీ కాలువల లైనింగ్ పనులకు, నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరా మెరుగుదల పనులకు కూడా సీఎం రేవంత్‌రెడ్డి కనగల్ సభ నుంచే శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు.
రైతు సంక్షేమమే మా ప్రాధాన్యత..
రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి ఈ ఏడాది నల్లగొండ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, జిల్లా వ్యాప్తంగా రూ. 1,800 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని వివరించారు. కేంద్ర సీఆర్ఎఫ్ నిధుల ద్వారా నల్లగొండ దర్వేశీపురం స్ట్రైట్ రోడ్డు పనులు చేపట్టామని, కనగల్ జంక్షన్ అభివృద్ధిని కూడా హ్యామ్ ప్రాజెక్టులో చేర్చామన్నారు. హైదరాబాద్ విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే మంజూరైందని, దాని పక్కనే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్ కూడా సిద్ధమవుతోందని కీలక విషయాలు వెల్లడించారు. తమ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసాతో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తోందని మంత్రి గుర్తుచేశారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మిస్తున్నట్లు చెప్పారు.
సీఎం సభను విజయవంతం చేయాలి..
లక్ష మందితో నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. ఎండ తీవ్రత దృష్ట్యా సభకు వచ్చే వారికి తాగునీరు, టెంట్లు, రవాణా వాహనాలు సమకూర్చాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా లైటింగ్, పార్కింగ్, లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పైలాన్ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీపీఓ శంకర్ నాయక్, డీఎస్పీ శివరాం రెడ్డి, ఆర్అండ్‌బీ డీఈ గణేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి