స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య కేసు చేదించిన పోలీసులు పదో తరగతి విద్యార్థుల ఘాతుకం..
జల్సాలు, కక్షతోనే దారుణం,సోషల్ మీడియాలో హత్య ప్లాన్ అన్వేషణ..
‘బాబు’ అనే ఒక్క మాటతో వీడిన మిస్టరీ..
ఇద్దరు మైనర్ల అరెస్ట్ రూ.1.54 లక్షల నగదు, ఫోన్లు స్వాధీనం..
వివరాలు వెల్లడించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..
నల్గొండ : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి దారుణ హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. పాఠాలు చెప్పిన ప్రిన్సిపల్‌నే ఇద్దరు పదో తరగతి విద్యార్థులు దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. జల్సాలకు అలవాటుపడటం, గతంలో తమను మందలించారన్న కక్ష, డబ్బుపై ఆశతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.
ఆ ఒక్క మాటతో ఊపందుకున్న దర్యాప్తు..
ఈ నెల 11న జరిగిన ఈ హత్యను పోలీసులు సవాలుగా తీసుకున్నారు. దేవరకొండ డీఎస్పీ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. 30 కిలోమీటర్ల పరిధిలోని 70కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి, 80 మందికి పైగా అనుమానితులను విచారించారు. అయితే, హత్యకు కొన్ని నిమిషాల ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్ మాట్లాడే క్రమంలో చివరిగా “బాబు” అని పిలవడమే ఈ కేసులో కీలక మలుపుగా మారింది. స్కూల్లో విద్యార్థులను ఆమె సాధారణంగా 'బాబు' అని పిలుస్తారని గుర్తించిన పోలీసులు.. దర్యాప్తును విద్యార్థుల వైపు మళ్లించారు. పాఠశాల పునఃప్రారంభమయ్యాక కొందరు విద్యార్థులపై నిఘా పెట్టారు. అందులో ఇద్దరు విద్యార్థుల కదలికలు, సీసీటీవీ విజువల్స్ సరిపోలడంతో వారిని బుధవారం ఉదయం దొనియాల ‘X’ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద లభించిన రూ.1.54 లక్షల నగదులోని కొన్ని రూ.500 నోట్లపై రక్తపు మరకలు ఉండటంతో అసలు విషయం బయటపడింది.
యూట్యూబ్‌లో హత్యకు పథకం.!
పోలీసుల కథనం ప్రకారం.. నిందితులైన ఇద్దరు 16 ఏళ్ల బాలురు (JCL) హాస్టల్‌లో ఒకే గదిలో ఉంటున్నారు. ఇంట్లో తెలియకుండా ఫోన్లు వాడుతూ సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో ‘సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా?’, ‘సాంకేతికంగా దొరక్కుండా హత్యలు చేయడం ఎలా?’ అని సెర్చ్ చేసేవారు. గతంలో హాస్టల్‌లో డబ్బులతో దొరికిపోవడంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి వారి తల్లిదండ్రుల సమక్షంలో మందలించారు. దీన్ని మనసులో పెట్టుకున్న బాలురు, ఆమె వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని భావించి హత్యకు ప్లాన్ చేశారు. ఘటన రోజు మంగళవారం సాయంత్రం మార్కెట్‌లో కత్తి, గ్లౌజులు, మాస్కులు కొనుగోలు చేశారు. రూపారెడ్డి ఇంటి వెనుక వైపు నుంచి వంటగది ద్వారా లోపలికి ప్రవేశించి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. అనంతరం అక్కడున్న రూ.2.50 లక్షల నగదుతో పరారయ్యారు. మార్గమధ్యలో కత్తి, మాస్కులు పొదల్లో పడేసి, ఎరుపు రంగు హుడీ టీషర్టును డ్రైనేజీలో పడేశారు.
రివార్డులు అందజేత..
నిందితుల నుంచి రూ.1.54 లక్షల నగదు, మృతురాలి ఐఫోన్, ఇతర ఫోన్లు, హత్యకు వాడిన కత్తి, గ్లౌజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును అత్యంత శాస్త్రీయంగా, వేగంగా ఛేదించిన డీఎస్పీ ఎం.వి. శ్రీనివాసరావు, సీఐ నవీన్ కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ జితేందర్ రెడ్డి, ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. ఎంత తెలివిగా నేరం చేసినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్థులను చట్టానికి పట్టిస్తామని ఎస్పీ హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి