యువతకు క్రైమ్ ట్రైనింగ్ 40 చోరీల 'కింగ్ పిన్' శ్రీకాంత్ ముఠా గుట్టురట్టు.!
యువతకు క్రైమ్ ట్రైనింగ్ 40 చోరీల 'కింగ్ పిన్' శ్రీకాంత్ ముఠా గుట్టురట్టు.!
NM Yadav
మభ్యపెట్టి మద్యం తాపించి నేరాల వైపు మళ్లించిన కరుడుగట్టిన నేరస్థుడు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 ఇళ్లల్లో దోపిడీ.. నల్గొండ పోలీసుల చేతికి చిక్కిన అంతర్‌రాష్ట్ర ముఠా..
ఆరుగురు నిందితుల అరెస్ట్, ఇద్దరు పరారీ 12 చోట్ల సరిపోలిన వేలిముద్రలు..
రూ. 53 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు, వాహనాలు స్వాధీనం..
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..
నల్గొండ : రెండు తెలుగు రాష్ట్రాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మోస్ట్ వాంటెడ్ అంతర్‌రాష్ట్ర నేరస్థుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు నేర సామ్రాజ్యాన్ని నల్గొండ జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. అమాయక యువకులను మభ్యపెట్టి, వారికి దొంగతనాల్లో శిక్షణ ఇచ్చి శ్రీకాంత్ ఏర్పాటు చేసిన ఎనిమిది మంది ముఠాలోని ఆరుగురు సభ్యులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 53 లక్షల విలువైన 260 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కేజీల వెండి, రూ. 1.50 లక్షల నగదుతో పాటు ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఈ సంచలన కేసు వివరాలను వెల్లడించారు.
జైలు పరిచయంతో మొదలై..
ఇటీవల పోలీసులకు చిక్కిన ముఠా నాయకుడు భూష్మి శ్రీకాంత్‌ను విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాంత్‌కు గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో పల్నాడు జిల్లాకు చెందిన లారీ డ్రైవర్, పాత నేరస్థుడు తమ్మిశెట్టి నాగరాజు (A-3)తో పరిచయం ఏర్పడింది. నాగరాజుపై గతంలో 10కి పైగా కేసులు, ఒక డెకాయిటీ కేసు ఉన్నాయి. జైలు నుంచి విడుదలయ్యాక కూడా నాగరాజు తన ప్రవర్తన మార్చుకోకుండా శ్రీకాంత్‌కు ఆశ్రయం కల్పించాడు. ఇద్దరూ కలిసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో సరికొత్త వ్యూహంతో ముఠాను తయారు చేశారు.
వైన్ షాపులే అడ్డా.. యువతకు 'దొంగతనం' కోచింగ్..
భూష్మి శ్రీకాంత్ విజయవాడ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నల్గొండ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ వైన్ షాపుల వద్ద ఉండే పేద, అమాయక యువకులను టార్గెట్ చేసేవాడు. మొదట వారికి ఉచితంగా మద్యం తాపించడం, డబ్బులు ఖర్చు పెట్టడం, వారి వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకుని ఆపద్బాంధవుడిలా నటించేవాడు. పూర్తిగా నమ్మకం కుదిరిన తర్వాత "తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే దొంగతనాలే మార్గం" అంటూ బ్రెయిన్ వాష్ చేసేవాడు.
ముఠాలో చేరిన యువకులకు శ్రీకాంత్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవాడు..
ఇళ్ల తాళాలు ఎలా సులభంగా పగులగొట్టాలి?, పగలు ఏ ఇళ్లు తాళం వేసి ఉన్నాయో ఎలా గుర్తించాలి? రాత్రి వేళల్లో ఎలా చొరబడాలి?, గస్తీ తిరిగే పోలీసుల కదలికలను ఎలా గమనించాలి?, సిసిటివి (CCTV) కెమెరాల కంటికి చిక్కకుండా ఎలా తప్పించుకోవాలి? దొంగిలించిన సొత్తును ఎక్కడ, ఎవరికి అమ్మి సొమ్ము చేసుకోవాలి? ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వారిని ప్రొఫెషనల్ దొంగలుగా మార్చాడు. ఈ ముఠాలోని తమ్మిశెట్టి నాగరాజు మినహా మిగిలిన యువకులకు ఎలాంటి పాత నేరచరిత్ర లేకపోవడం గమనార్హం.
మూడు ప్రత్యేక బృందాలతో వేట..
మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు (Cr.No. 257/2024 u/s 331(4), 305 BNS) ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు శ్రీకాంత్ ఇచ్చిన సమాచారం కీలకంగా మారింది. తెలంగాణలో 28, ఆంధ్రప్రదేశ్‌లో 12 కలిపి మొత్తం 40 చోరీలకు ఈ ముఠా పాల్పడినట్లు తేలింది. నిందితులను పట్టుకునేందుకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్‌స్పెక్టర్లు ఎం. జితేందర్ రెడ్డి, డి. చంద్రశేకర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ సిఐ పి.ఎన్.డి. ప్రసాద్, ఎస్సైలు ఆంజనేయులు, సురేశ్ యాదవ్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. Mmk?ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిరంతర నిఘా సహాయంతో శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల, అంజనీపురం, అమరావతి మండలం మండేపూడి గ్రామాల్లో ఏకకాలంలో దాడులు చేసి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఎంత తెలివిగా చోరీలు చేసినా సాంకేతికత ముందు లొంగిపోక తప్పలేదు. రెండు రాష్ట్రాల్లోని సుమారు 40 పోలీస్ స్టేషన్ల పరిధిలో (మిర్యాలగూడ, నల్గొండ, చండూర్, డిండి, నరసారావుపేట, విజయవాడ, బాపట్ల తదితర ప్రాంతాలు) వీరు చోరీలకు పాల్పడగా.. 12 వేర్వేరు నేర స్థలాల్లో సేకరించిన వేలిముద్రలు (Fingerprints) ప్రస్తుత నిందితుల వేలిముద్రలతో కచ్చితంగా సరిపోలాయి. అలాగే పలు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కూడా నిందితుల కదలికలను పోలీసులు నిర్ధారించుకున్నారు. నేరస్థులు ఎంత తెలివిగా వ్యవహరించినా చట్టం నుండి తప్పించుకోలేరు. ప్రతి చిన్న ఆధారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి ఈ అంతర్‌రాష్ట్ర ముఠాను ప్రారంభ దశలోనే పట్టుకున్నాం. దీనివల్ల భవిష్యత్తులో జరగబోయే అనేక పెద్ద నేరాలను నివారించగలిగాం. యువత తప్పుడు ప్రలోభాలకు లోనై జీవితాలను నాశనం చేసుకోవద్దు..
పట్టుబడిన నిందితుల వివరాలు...
- తమ్మిశెట్టి నాగరాజు (32), లారీ డ్రైవర్, పిడుగురాళ్ల.
- అల్లంశెట్టి సాయి కిరణ్ అలియాస్ పాండు (22), కూలీ, అంజనీపురం.
- సమంతపు వెంకట అశోక్ (33), పురోహితుడు, అంజనీపురం.
- ఆలేటి కోటేశ్వర్ రావు (22), ఆటో డ్రైవర్, పిడుగురాళ్ల.
- సపావత్ నాగ కిరణ్ బాబు నాయక్ (31), ఆటో డ్రైవర్, అమరావతి మండలం.
- పిల్లి రాజేష్ (25), బైక్ మెకానిక్, పెదకూరపాడు మండలం. గాడిబోయిన గోపి సాయి, తమ్మండ్ర రమేష్ అనే మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశాం అని ఎస్ పి తెలిపారు. వీరి నుంచి, బంగారం 260 గ్రాములు (విలువ సుమారు రూ. 53 లక్షలు), వెండి 5 కేజీలు, నగదు రూ. 1,50,000, ఇతర వస్తువులు 2 ఎల్ఈడీ టీవీలు, 2 సౌండ్ బార్స్, 5 ద్విచక్ర వాహనాలు, 7 మొబైల్ ఫోన్లు. పోలీసులు రికవరీ చేశారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, ప్రాణాలకు తెగించి అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు ఎం.జితేందర్ రెడ్డి, డి. చంద్రశేకర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ సీఐ ప్రసాద్, ఎస్సైలు విజయకుమార్, యు. సురేశ్ యాదవ్ , హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధనగిరి, పుష్పగిరి, నాగరాజు, వహీద్ పాషా, ఫయాజ్, కానిస్టేబుళ్లు శివరాజ్, నరేష్, గులాందస్తగిరి, కమల్ కిశోర్, సాయి, జునైద్, నాగరాణిలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి, వారికి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి