బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: లోతట్టు ప్రాంతాల్లో చైర్‌పర్సన్ పర్యటన
పట్టణంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ పురపాలక సంఘ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ కోరారు. రాత్రి కురిసిన వర్షానికి 12వ వార్డు గాంధీ పార్క్ వెనకాల ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని మూడు ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో, సమాచారం అందుకున్న చైర్‌పర్సన్.. స్థానిక కౌన్సిలర్ పాక చిరంజీవితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధిత ఇళ్లలో నిలిచిన నీటిని తక్షణమే తొలగించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. వరద అత్యవసర సహాయక చర్యల కోసం రెండు జేసీబీలను అందుబాటులో ఉంచి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్, అధికారులను స్పష్టంగా ఆదేశించారు.14వ వార్డు రూబీ ఇంజనీరింగ్ వర్క్స్ వెనకాల నిలిచిన వర్షపు నీటిని జేసీబీతో ఘాతు తీసి సర్వీస్ రోడ్డులోని పెద్ద నాలాలోకి మళ్లించారు. తంగడపల్లి రోడ్డు రహదారిపై నిలిచిన నీటిని నాగులకుంటలోకి పంపించేలా మార్గం సుగమం చేశారు.హనుమాన్ నగర్ లక్కారం నుంచి వచ్చే వరద నీటి ప్రవాహానికి ప్రస్తుతం ఉన్న మ్యాన్ హోల్ సరిపోకపోవడంతో, భవిష్యత్తులో ఈ నీటిని వేరే మార్గానికి మళ్లించేలా ఏర్పాట్లు చేస్తామని స్థానిక నాయకుడు కామిశెట్టి భాస్కర్‌కు హామీ ఇచ్చారు. వలిగొండ రోడ్డు కల్వర్టు వద్ద నిలిచిన నీటిని పక్కనే ఉన్న మోరీలోకి మళ్లించారు. డ్రైనేజీ పూడికతీత జయభూమి వెంచర్ నుంచి తాలసింగారం చెరువు వరకు ఉన్న పెద్ద డ్రైనేజీలో పూడికతీత పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, ఎస్.ఐ హనుమాన్ ప్రసాద్, ఈఈ రేణు కుమార్, టీడబ్ల్యూఐ సంతోష్, నాయకులు ఉడుగు రమేష్, బత్తుల విప్లవ్, జవాన్లు అంజయ్య, నరసింహ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి