కాంగ్రెస్ అసమర్థతతో రాష్ట్రంలో పాలన పత్తాలేదు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి...
భూముల దోపిడీకే 'భూభారతి' ఆంధ్రాకు నీళ్ల అప్పగింతపై సీఎం, మంత్రుల మౌనం...
సాగర్, AMRP ఆయకట్టుకు తక్షణమే నీళ్లు విడుదల చేయాలి...
నల్లగొండ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాలన పూర్తిగా పత్తాలేకుండా పోయిందని, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు కేవలం భూముల దోపిడీపైనే దృష్టి పెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నాయకులు రెగట్టే మల్లికార్జున రెడ్డి, సింగం రాంమోహన్, నిరంజన్ వలీ, మారగోని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ధరణిని తీసేసింది దోచుకోవడానికే...
ధరణి పోర్టల్‌ను రద్దు చేసి తీసుకొచ్చిన 'భూభారతి' వెనుక భారీ కుట్ర దాగి ఉందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. గతంలో ధరణిలో 10 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటే, కొత్తగా తెచ్చిన భూభారతి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. చివరికి మంత్రులు, ఎమ్మెల్యేల భూములను కూడా అందులో పెట్టారని ఎద్దేవా చేశారు.
పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీకి తెలంగాణ నీళ్ల తరలింపు...
కృష్ణమ్మ నీటి విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. శ్రీశైలంలో 120 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 70 టీఎంసీలు మాత్రమే కనిపించడం వెనుక పెద్ద మతలబు ఉందన్నారు. మిగిలిన 200 టీఎంసీల నీళ్లు ఎటు పోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు గేట్లను ధ్వంసం చేసి, అలాగే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లను ఏకపక్షంగా తరలిస్తుంటే సీఎం, ఇరిగేషన్ మంత్రులకు సోయి లేకపోవడం దుర్మార్గమన్నారు. నీటి విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నీతి తప్పి ప్రవర్తిస్తుంటే, రేవంత్ రెడ్డి జాతి తప్పి వ్యవరిస్తున్నారని విమర్శించారు.
ఎడమ కాల్వ రైతులు నాట్లు వేసుకోవాలి – నీళ్లు ఇప్పించే బాధ్యత మాదే...
ఎల్ నినో తరుముకొస్తుందని చెప్తున్న ప్రభుత్వం ఉన్న నీళ్లను కూడా సరిగ్గా వాడుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. "సాగర్‌లో ప్రస్తుతం ఉన్న 70 టీఎంసీల్లో కేవలం 30 టీఎంసీలు ఉపయోగిస్తే ఒక పంటకు సరిపడా నీళ్లు ఇవ్వొచ్చు. సరిగ్గా ప్లాన్ చేస్తే రెండు పంటలకూ నీళ్లందించవచ్చు. నీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించాలి. ఎడమ కాల్వ, వరద కాల్వ, AMRP ఆయకట్టు రైతులు ధైర్యంగా వరి నాట్లు వేసుకోవాలి, వారికి నీళ్లు ఇప్పించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది" అని హామీ ఇచ్చారు. స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 'వాటర్ - నీళ్లు' తప్ప ఏమీ పట్టడం లేదని, ఆయన సొంత నియోజకవర్గ పరిధిలోని ఉదయ సముద్రం ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. అమృత రావు మైసారావు ప్రాజెక్టు (AMRP) ద్వారా చెరువులు, కుంటలను నింపాలని డిమాండ్ చేశారు.
మిషన్ భగీరథ పక్కనపెట్టారు విద్యుత్ రంగాన్ని నాశనం చేశారు...
కేసీఆర్ హయాంలో ఇచ్చిన 24 గంటల విద్యుత్ ప్రస్తుతం ఎటు పోయిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కమీషన్లు రావు అనే ఉద్దేశంతోనే విద్యుత్ ఉత్పత్తులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంచినీళ్లందించే మిషన్ భగీరథను పక్కనపెట్టారని, కన్నెపల్లి పంప్‌హౌస్‌లో నీళ్లున్నా ఎత్తిపోయడం లేదని విమర్శించారు. ఈ ప్రజా సమస్యలను నిలదీస్తామనే భయంతోనే తమను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. రైతుల కోసం బీఆర్ఎస్ ఎంతవరకైనా పోరాడుతుందని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి