14 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.
బీబీనగర్: ఎన్నేళ్లు గడిచినా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని తాజా పరిణామం మరోసారి స్పష్టం చేసింది. బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలోని సర్వే నంబర్ 339లో దళితులకు కేటాయించిన భూమికి సంబంధించి వివాదం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వరకు వెళ్లింది. ఈ వ్యవహారంలో నలుగురు ప్రభుత్వ అధికారులతో పాటు మొత్తం 14 మందిపై కేసు నమోదైనట్లు సమాచారం.
ఇందిరాగాంధీ హయాంలో దళితులకు కేటాయించిన భూమిలో ఒక కుటుంబానికి సంబంధించిన ఎకరం భూమిని 2018–19లో అప్పటి బీబీనగర్ ఎంఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, (ప్రస్తుతం నల్గొండ Rdo .)సర్వేయర్ రజినీకాంత్,( ప్రస్తుతం చిట్యాల) Ri రజినేష్ .( ప్రస్తుతం భువనగిరి) తదితరులు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా డీమార్కేషన్, పంచనామా నిర్వహించారని ఆరోపణలు ఉన్నాయి. భూమి సర్వే సమయంలో సంబంధిత దళిత కుటుంబానికి నోటీసులు ఇవ్వకుండా, అధికారిక ప్రక్రియను పాటించకుండా ఎంఓయూలు చేయించి భూమిని స్వాధీనం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ విషయం తెలుసుకున్న భూమి వారసుడు, యువ న్యాయవాది జేరిపోతుల నగేష్ సంబంధిత భూ పత్రాలను సేకరించి అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోయిందని తెలిపారు. బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండా, భూమిపై ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ తనతో పాటు తన అన్నపై తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.దీంతో న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నగేష్ నల్గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. సమర్పించిన పత్రాలను పరిశీలించిన కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.
తనపై కేసు నమోదు చేసిన స్టేషన్‌లోనే అధికారులపై ఎఫ్‌ఐఆర్
విధి నిర్వహణలో భాగంగా పనిచేసిన పోలీస్‌స్టేషన్‌లోనే సంబంధిత అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు కావడం ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామంగా మారింది. నలుగురు ప్రభుత్వ అధికారులతో సహా మొత్తం 14 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైనట్లు సమాచారం. కేసును తన సమస్యగా భావించిన పత్తి నరేష్ తదితర మిత్రులు నగేష్‌కు అండగా నిలిచారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి