అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు
సూర్యాపేటటౌన్ ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ అన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఆదివారం సూర్యాపేట పట్టణంలోని 11వ వార్డు రాయినిగూడెంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి, మాజీ కౌన్సిలర్ ఎడ్ల గంగా భవాని వీరమల్లు యాదవ్, వార్డు అధ్యక్షుడు నంద్యాల మహేష్‌రెడ్డితో కలిసి ఉప్పునూతల మంగమ్మ, సందనబోయిన రేణుకల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గౌరవప్రదమైన జీవితం అందుతోందన్నారు. ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రతతో పాటు ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని తెలిపారు.
మహిళల ఆర్థిక సాధికారత కోసం మహాలక్ష్మి, రైతులకు రైతుభరోసా, ఉచిత విద్యుత్, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా హామీలను అమలు చేస్తున్నామని సర్వోత్తమ్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి