స్థానిక సంస్థల ఎన్నికలను పటిష్టంగా ఎదుర్కొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. విజయనగరంలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహించిన సన్నాహక, విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగాలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత ఇస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ పోటీకి సిద్ధంగా ఉండాలని సూచించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తే 2029 ఎన్నికల్లో విజయం సాధించేందుకు బాటలు పడతాయన్నారు.
కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఆయన విమర్శించారు. రైతులు, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను, ప్రస్తుత ప్రభుత్వ హామీలు, పాలనతో పోల్చి ప్రజలకు వివరించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో జిల్లా పరిషత్, మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలతోపాటు గ్రామస్థాయి పదవుల్లోనూ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.
అక్రమ కేసులకు భయపడొద్దు
అధికార పార్టీ నేతలు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పారు. నామినేషన్ల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతమైన అభ్యర్థులను ఎంపిక చేసి గెలిపించేందుకు సమష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు, ఎన్నికల హామీల అమలుపై ప్రజల్లో చర్చ జరిగేలా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు మద్దతు ఇస్తారనే నమ్మకం ఉందన్నారు. విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల స్థానాలను కైవసం చేసుకునేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, పరిశీలకులు తదితరులు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో యువ నాయకులు డా. అనూష బొత్సా, సందీప్ బొత్సా, జిల్లా పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ విభాగాల నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, మహిళా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి