టిప్పర్ల తాండవం… పెద్దకాపర్తికి నిద్రలేని రాత్రులు
టిప్పర్ల తాండవం… పెద్దకాపర్తికి నిద్రలేని రాత్రులు
Editor Desk
పెద్దకాపర్తి, చిట్యాల మండలం: గ్రామం గుండా మట్టి టిప్పర్ల నిరంతర రాకపోకలతో పెద్దకాపర్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా రాత్రింబవళ్లు టిప్పర్లు సంచరిస్తుండటంతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది.
స్థానికుల కథనం ప్రకారం, జాతీయ రహదారి నుంచి భారీగా నల్లమట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా సాగుతున్న ఈ రవాణా వల్ల గ్రామం మొత్తం దుమ్ముతో కప్పుకుపోతోంది. అధికారుల పర్యవేక్షణ లోపించిందా? లేక చూసీచూడనట్లా వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామమా… జాతీయ రహదారినా?
టిప్పర్ల వేగం, రాకపోకలతో పెద్దకాపర్తి గ్రామం కాస్తా జాతీయ రహదారిని తలపిస్తోంది. ఇరుకైన వీధుల్లోనే భారీ వాహనాలు వేగంగా దూసుకుపోతుండటంతో ప్రమాద భయం పెరిగింది. చిన్నారులు, వృద్ధులు రోడ్డు మీదకు రావాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దుమ్ము, ధ్వని కాలుష్యం కాటేస్తున్నాయి
టిప్పర్ల రాకపోకలతో గ్రామంలో దుమ్ము ధూళి విపరీతంగా ఎగసిపడుతోంది. ఇళ్లలోకి దుమ్ము చేరి జీవనం ఇబ్బందికరంగా మారింది. మరోవైపు అర్ధరాత్రి వేళల్లో కూడా టిప్పర్ల శబ్దాలతో గ్రామస్థులకు నిద్ర కరువైంది.
“మేము గ్రామంలో ఉంటున్నామో, హైవే పక్కన ఉంటున్నామో అర్థం కావడం లేదు. పిల్లల్ని బయటకు పంపాలంటే భయంగా ఉంది” అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పర్మిషన్ పేరుతో రిసిప్ట్… అసలు నిజం ఏమిటి?
టిప్పర్ డ్రైవర్‌ను అనుమతుల గురించి ప్రశ్నించగా, “ఇదే మా పర్మిషన్” అంటూ ఒక రసీదును చూపిస్తున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఆ రసీదు నిజంగా మట్టి తరలింపుకు చెల్లుబాటు అయ్యే అనుమతేనా? లేక సాధారణ లావాదేవీ పత్రాన్ని పర్మిషన్‌గా చూపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారులు స్పందించేనా?
నిబంధనలను అతిక్రమిస్తూ మట్టి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖలు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, ఈ అక్రమ మట్టి రవాణాను అరికట్టాలని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి