తిరుమలగిరి;
తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం (టీఎంజేఎఫ్) మూడవ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని మంగళవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే చౌరస్తాలో కరపత్రికలను టీఎంజేఎఫ్ నాయకులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టీఎంజేఎఫ్ రాష్ట్ర నాయకులు కళాశ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. “జనం కోసమే జర్నలిజం” అనే లక్ష్యంతో ప్రజల గొంతుకు స్వేచ్ఛ, జర్నలిస్టుల కలానికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం పనిచేస్తోందని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలను ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ కోఠిలోని బీసీసీఈ భవన్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా ఈ సందర్భంగా తిరుమలగిరి మండల టీఎంజేఎఫ్ కమిటీని ప్రకటించారు. తిరుమలగిరి మండల తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడిగా బాకీ శ్రీనివాస్ మాదిగ, కార్యదర్శిగా నిర్మాళ్ల బాలకిష్ణ ఎంపికైనట్లు తెలిపారు. టీఎంజేఎఫ్ ఉద్యమానికి సీనియర్ జర్నలిస్టు చొల్లేటి రాములు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు బాకీ శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, సమాజంలోని ప్రతి రంగంలో కుల వివక్ష వెంటాడుతూనే ఉందని, జర్నలిస్టు రంగం కూడా ఇందుకు మినహాయింపు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న, పెద్ద పత్రికల మధ్య తేడాలు చూపుతూ జర్నలిస్టులను వివక్షకు గురిచేస్తున్న పరిస్థితులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఇలాంటి సామాజిక భేదాలను రూపుమాపడంతో పాటు జర్నలిస్టులకు జరుగుతున్న అవమానాలు, దాడులు, వివక్షలు, అణచివేతలను ఎండగట్టేందుకు తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం కృషి చేస్తోందని తెలిపారు. టీఎంజేఎఫ్ కేవలం ఒక కులానికి పరిమితమైన సంఘం కాదని, సమాజంలో జర్నలిస్టుల హక్కులు, గౌరవం, భద్రత కోసం పోరాడే వేదికగా పనిచేస్తోందని అన్నారు.
నిత్యం సామాజిక చైతన్యం కోసం వివిధ సామాజిక అంశాలు, ఉద్యమాలకు తమ వంతు మద్దతు, సహకారం అందిస్తూ టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. కేవలం మాదిగ జాతికి చెందిన జర్నలిస్టులే కాకుండా, ప్రతి జర్నలిస్టు సామాజిక బాధ్యతగా టీఎంజేఎఫ్ ఉద్యమానికి మద్దతుగా మహాసభలకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి