ఆరోగ్యవంతమైన చిన్నారులతోనే ఆరోగ్యవంతమైన భారత్.
హైదరాబాద్, సెప్టెంబర్ 1: ఆరోగ్యవంతమైన చిన్నారులతోనే దృఢమైన, ఆరోగ్యవంతమైన భారత్‌ను నిర్మించగలమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. పోషణ మాసోత్సవం–2026లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గగన్‌మహల్‌లోని ఏవీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐకాప్ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు రక్తహీనత, ఊబకాయం, ఎదుగుదల లోపం వంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో వయసుకు తగ్గ శారీరక ఎదుగుదల లేని చిన్నారుల శాతం 33 నుంచి 27కు తగ్గిందన్నారు. చిరుధాన్యాలు, సంప్రదాయ ఆహార పద్ధతులను ప్రోత్సహించాలని, విద్యార్థులు క్రీడలు, వ్యాయామం, యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు.సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ మాట్లాడుతూ.. పోషకాహారం ఆరోగ్యం, అభ్యాసం, జీవన నాణ్యతతో ముడిపడి ఉందన్నారు. కార్యక్రమంలో ఏవీ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మ, పీఐబీ, సీబీసీ అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి