మిర్యాలగూడలో బీఆర్ఎస్ ధర్నా వేదికగా పోరుకు సిద్ధం...మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
కృష్ణా జలాల తరలింపుపై రేవంత్ ప్రభుత్వం మౌనం సాగర్ ఆయకట్టుకు తీవ్ర ద్రోహం...
రైతు హక్కుల కోసం 7 రోజుల నిరసనలు...
ఆంధ్రా నాయకులకు తొత్తులుగా మంత్రులు...
నల్గొండ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులు, నీటి తరలింపుపై రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా మౌనం వహిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి. జగదీష్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ లాబీయింగ్, సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి నోరు మెదపడం లేదని ఆరోపించారు. నాగార్జునసాగర్ నీటిని సమర్థవంతంగా వినియోగించుకోకుండా తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలోని ముఖ్యాంశాలు.
రైతు హక్కుల కోసం 7 రోజుల నిరసనలు...
కృష్ణా నీటిని అక్రమంగా తరలిస్తుంటే అడ్డుకోకుండా నల్గొండ జిల్లా ఆయకట్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేస్తోందని జగదీష్‌రెడ్డి విమర్శించారు. రైతుల హక్కులు, కృష్ణా జలాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 7 రోజుల పాటు విస్తృత నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (కేటీఆర్) నేతృత్వంలో రైతు ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు.
వచ్చే నెల 3న మిర్యాలగూడలో రైతు మహాధర్నా..
వచ్చే నెల 3వ తేదీన మిర్యాలగూడలో భారీ ఎత్తున 'రైతు మహా ధర్నా' చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. సాగర్ ఆయకట్టు రైతాంగమంతా ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుబీమా, రైతుబంధు ఎగ్గొట్టి దారుణంగా మోసం చేసిందని జగదీష్‌రెడ్డి ఆరోపించారు. మహిళలకు నెలకు ₹2,500, రైతు భరోసా, పూర్తిస్థాయి రుణమాఫీ వంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ, ఏఎంఆర్‌పీ (AMRP) కింద వెంటనే కృష్ణా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 'చలో సాగర్' పేరుతో సాగర్ ప్రాజెక్టును ముట్టడిస్తామని, తమ హక్కుగా రావాల్సిన నీళ్లను సాధించుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రా నాయకులకు తొత్తులుగా మంత్రులు...
జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు చిన్న పదవుల కోసం ప్రజల ముందు దోషులుగా మిగిలిపోయారని, చరిత్రహీనులుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ నీటి దోపిడీ జరుగుతోందని, రేవంత్-చంద్రబాబు కలిసి సాగర్ రైతులపై పగబట్టారని ఆరోపించారు. ఆంధ్రలో కుడి కాలువ కింద పంటలు పండుతుంటే, తెలంగాణలోని ఎడమ కాలువ కింద పొలాలు ఎందుకు ఎండుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో నిర్వహించే సభతో కాంగ్రెస్ ప్రభుత్వ బండారాన్ని ప్రజాక్షేత్రంలో బయటపెడతామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి