నాయి బ్రాహ్మణ క్షవరవృత్తి కార్మికుల ప్రజావాణిలో వినతి.
చిట్యాల:
తరతరాలుగా క్షవరవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నాయి బ్రాహ్మణ క్షవరవృత్తి కార్మికులకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని నాయి బ్రాహ్మణ సేవా సంఘం చిట్యాల పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం చిట్యాల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేనేత, గీత కార్మికులకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ అందిస్తున్న మాదిరిగానే నాయి బ్రాహ్మణ క్షవరవృత్తి కార్మికులకు కూడా అదే వయసులో పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. క్షవరవృత్తి చేయడం వల్ల 40 ఏళ్లకే కంటి చూపు తగ్గడం, శారీరక సమస్యలు ఎదురవడం వంటి ఇబ్బందులతో పలువురు వృత్తిని కొనసాగించలేక కుటుంబాలను పోషించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం నాయి బ్రాహ్మణులు అనేక పోరాటాల్లో పాల్గొన్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు, తమ పిల్లల భవిష్యత్తు మెరుగుపడుతుందని ఆశించామని తెలిపారు. అయితే ప్రస్తుతం కనీసం పింఛన్ కూడా పొందలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.నాయి బ్రాహ్మణ క్షవరవృత్తి కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు
నాయి బ్రాహ్మణ సేవా సంఘం చిట్యాల పట్టణ అధ్యక్షుడు అమరోజు వెంకటేశం నాయి, ప్రధాన కార్యదర్శి అమరోజు శ్రీరాములు నాయి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి