నల్లగొండలో రాజకీయ రగడ మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ దాడి.!
కోమటిరెడ్డి కటౌట్ దగ్ధం కోడిగుడ్లు, టమాటలతో నిరసన...
వర్షిత్ రెడ్డి ఇంటి పై కాంగ్రెస్ నాయకుల దాడి ముదిరిన ఘర్షణ...
నల్లగొండ: నల్లగొండ పట్టణంలో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ నాయకులు దాడికి పాల్పడటంతో పట్టణంలో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
మంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద బిజెపి నాయకుల హల్‌చల్...
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ కటౌట్‌ను తగలబెట్టారు. అనంతరం కార్యాలయంపైకి కోడిగుడ్లు, టమాటాలు విసురుతూ తీవ్ర నిరసన తెలిపారు. ఈ దాడి ఘటనలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో పాటు ఓ మహిళా నాయకురాలు, 25వ వార్డు కార్పొరేటర్ రాఖీ అనుచరులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "రాష్ట్ర బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగానే మంత్రి కార్యాలయంపై రాజకీయంగా దాడి చేశాం. అధికార బలంతో మా ఇళ్లల్లోకి దూరి, నా మాతృమూర్తిపై, కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం పిరికిపంద చర్య. అహంకారం ఉంటే నాపై ప్రదర్శించాలి గానీ, కుటుంబంపై కాదు" అని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని, బస్తీమే సవాల్.. దాడికి ప్రతిదాడికి తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
మండిపడ్డ కాంగ్రెస్ నాయకులు వర్షిత్ రెడ్డి ఇంటి పై దాడి...
మంత్రి ఇంటిపై దాడి వార్త తెలిసిన వెంటనే కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. దారిపొడవునా బీజేపీ నాయకుల ఫ్లెక్సీలను చించివేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తామని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరికలు జారీ చేయడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
పోలీసుల మోహరింపు మాజీ మున్సిపల్ చేర్మన్ బుర్రి ని అడ్డుకున్న పోలీసులు..
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో డిఎస్పి శివరాం రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్ శ్రేణులను బీజేపీ కార్యాలయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. నాయకులకు నచ్చజెప్పేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పోలీసుల అడ్డుకావడంతో మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలతో కలిసి బీజేపీ కార్యాలయం వైపు పాదయాత్రగా బయలుదేరారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి