ఆరెగూడెంలో చౌటుప్పల్ పోలీసుల ‘సైబర్ క్రైమ్ అవేర్‌నెస్’ సదస్సు
అపరిచిత వ్యక్తుల చేతుల్లో మోసపోవద్దని, ఆన్‌లైన్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి గోస పడొద్దని చౌటుప్పల్ ఇన్స్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ హెచ్చరించారు. మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామంలో చౌటుప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... సైబర్ క్రిమినల్స్ రోజుకో కొత్త రూపులో అమాయక ప్రజలను ముంచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని, వాటిని అస్సలు క్లిక్ చేయకూడదని స్పష్టం చేశారు. మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ కాకుండా ఉండాలంటే OTP, PIN, CVV, UPI PIN వివరాలను పరాచకానికైనా ఎవరికీ చెప్పవద్దని సీఐ సూచించారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు ఇస్తామనే ఆశ చూపే ఇన్వెస్ట్‌మెంట్లు, లోన్లు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, లాటరీల పేరుతో వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దన్నారు. భయభ్రాంతులకు గురిచేసే 'డిజిటల్ అరెస్ట్' బెదిరింపులకు అస్సలు లొంగకూడదని ధైర్యం చెప్పారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలని పిలుపునిచ్చారు. మోసపోయామని గ్రహించిన వెంటనే సెకన్ల వ్యవధిలో సైబర్ హెల్ప్‌లైన్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బులు మళ్లీ రికవరీ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. లావాదేవీల ఆధారాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్, నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి