చట్ట పరిధిలోనే జీవించాలి ట్రాన్స్‌జెండర్లకు డీఎస్పీ శివరాం రెడ్డి హితవు...
బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు...
వేధింపులుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచన...
నల్గొండ : సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా గౌరవప్రదమైన జీవనం సాగించాలని నల్గొండ డీఎస్పీ కే. శివరాం రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ పట్టణ పరిధిలోని ట్రాన్స్‌జెండర్లతో గురువారం ఆయన ఒక ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. వ్యాపార సంస్థలు, దుకాణాలు, ఇళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు దిగడం చట్టరీత్యా నేరమన్నారు. పండుగలు, శుభకార్యాల సమయంలో ప్రజలను బెదిరించడం లేదా అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని, అటువంటి వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా స్వచ్ఛందంగా ఇచ్చే సహాయాన్ని మాత్రమే స్వీకరించాలని, ప్రజల నుంచి వసూళ్లపై ఫిర్యాదులు వస్తే నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
పోలీస్ శాఖ సహకారం ఉంటుంది...
ట్రాన్స్‌జెండర్లు కూడా సమాజంలో సమాన భాగస్వాములేనని, వారి పట్ల ప్రజలు గౌరవభావంతో వ్యవహరించాలని డీఎస్పీ పేర్కొన్నారు. అదే సమయంలో ట్రాన్స్‌జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వేధింపులు లేదా ఇతర చట్టపరమైన ఇబ్బందులు ఉంటే భయపడకుండా పోలీసులను సంప్రదించవచ్చని, పోలీస్ శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసానిచ్చారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టౌన్ సీఐలు ఆదిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదాబాబు, షరీఫ్ తో పాటు నల్గొండ జిల్లాలోని పలువురు ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి