రెండు వాహనాల దారిలో మూడు.. నాలుగు వరుసల్లో రాకపోకలు
గుంతలమయమైన రోడ్డుతో వాహనదారులు, పాదచారుల్లో భయాందోళన.
ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం.
చిట్యాల: జాతీయ రహదారి–65 విస్తరణ పనులు చిట్యాల పట్టణ ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. నిర్మాణ పనుల్లో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. రెండు వాహనాలు మాత్రమే సురక్షితంగా వెళ్లగలిగే మార్గంలో మూడు, నాలుగు వరుసల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
వ్యాపారి మృతి.. కలకలం.
చిట్యాల పురపాలక పరిధిలోని కెనరా బ్యాంకు ఎదురుగా ఆదివారం సాయంత్రం సర్వీస్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాలు విచ్చలవిడిగా తిరుగుతుండటంతో చిన్నపాటి పొరపాటు కూడా ప్రాణాల మీదకు వస్తోందని స్థానికులు చెబుతున్నారు.
గుంతలమయంగా.. రాకపోకలు అస్తవ్యస్తం
సర్వీస్ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. ఒకవైపు రోడ్డు దుస్థితి.. మరోవైపు అధిక సంఖ్యలో వాహనాల రాకపోకలు.. ఇంకోవైపు పాదచారులు, ద్విచక్ర వాహనదారులు వెళ్లేందుకు ప్రత్యేక మార్గం లేకపోవడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో వాహనాలు ఇష్టారాజ్యంగా దూసుకెళ్తుండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిష్కారం.. తక్షణ చర్యలే!
ప్రమాదాల నివారణకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
జాతీయ రహదారి–65 విస్తరణ పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలి.
గుంతలమయమైన సర్వీస్ రోడ్డును తక్షణమే మరమ్మతు చేయాలి.
సర్వీస్ రోడ్డుపై రెండు వాహనాలే వెళ్లేలా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలి.
పాదచారులు, ద్విచక్ర వాహనదారుల కోసం సర్వీస్ రోడ్డుకు ఒకవైపు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేసి డివైడర్ నిర్మించాలి.ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ముందే అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని చిట్యాల పట్టణ ప్రజలు, ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి