మోడల్ స్కూల్ ఎదురుగా 5 ఎకరాల్లో నిర్మాణం
రెండు నెలల్లో టెండర్ ప్రక్రియ పూర్తి: బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పరమేష్
చౌటుప్పల్‌లో అధునాతన హంగులతో నూతన కోర్టు భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాడూరు పరమేష్
తెలిపారు.బుధవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్కారం పరిధిలోని మోడల్ స్కూల్ ఎదురుగా ఉన్న సర్వే నంబరు 50లోని ఐదు ఎకరాల విస్తీర్ణంలో నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ రాబోయే రెండు నెలల్లో పూర్తవుతుందని స్పష్టం చేశారు. వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక ప్రాంతమైన చౌటుప్పల్ ప్రజల న్యాయ అవసరాల దృష్ట్యా భవిష్యత్తులో ఇక్కడ ఇండస్ట్రియల్ కోర్టుతో పాటు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అనుమతుల సాధనకు సహకరించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. అడిషనల్ కోర్టు భవన సాధనకు కృషి చేసిన బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎలమొని శ్రీనివాస్, ఉడుగు శ్రీనివాస్ గౌడ్, బాల్యం వెంకట చలపతిలను అభినందించారు. భవన నిర్మాణ అనుమతులు రావడం పట్ల జూనియర్ ఇన్‌చార్జి సివిల్ జడ్జి శిరీష, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. అనుమతుల సాధనకు శ్రమించిన అధ్యక్షుడు పరమేష్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పడమటి మహిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పిట్టల భిక్షం, జాయింట్ సెక్రటరీ మక్తాల నరసింహ, కోశాధికారి స్వాతి, లైబ్రరీ సెక్రెటరీ నర్రి స్వామి, సీనియర్ న్యాయవాదులు ముత్యాల సత్తిరెడ్డి, రాపోలు వేణు, చామట్ల జంగయ్య, జిల్లా రమేష్, దేశబోయిన శ్రీశైలం, మహమ్మద్ ఖయ్యూం, కిరణ్, నకిరేకంటి జ్యోతి, పిట్టల భరత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి