శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు...
రౌడీ షీటర్లకు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి హెచ్చరిక...
150 మందికి కౌన్సెలింగ్, 125 మందిపై బైండ్ ఓవర్ కేసులు...
నల్గొండ : పట్టణంతో పాటు సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి హెచ్చరించారు. రాబోయే వినాయక నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని బుధవారం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ టౌన్ పరిధిలోని 75 మందితో పాటు సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 150 మంది రౌడీ షీటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గతంలో నేరాలకు పాల్పడిన వారు తమ ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. ఇకపై ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా సాధారణ పౌరులుగా ప్రశాంతంగా జీవించాలని స్పష్టం చేశారు. ఉత్సవాల సమయంలో గొడవలు, అల్లర్లకు పాల్పడినా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా సహించేది లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగించడమే కాకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
125 మందిపై బైండ్ ఓవర్...
సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికే 125 మంది రౌడీ షీటర్లపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. సంబంధిత ఎమ్మార్వోల సమక్షంలో రూ. 2 లక్షల పూచీకత్తుతో పాటు, 6 నెలల కాలపరిమితితో బైండ్ ఓవర్ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, నేరాలకు దూరంగా ఉంటూ కుటుంబంతో గౌరవప్రదమైన జీవితం గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఆదిరెడ్డి, ఎస్ఐలు సైదాబాబు, శివప్రసాద్, ముత్తయ్య, పోలీస్ సిబ్బంది షకీల్, శంకర్, అంజయ్య, బాలకోటి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి