ఒక్కరిని అరెస్టు చేసిన పోలీసులు.. రూ.60 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
కోదాడ పట్టణంలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని కోదాడ పట్టణ పోలీసులు, జిల్లా నేర పరిశోధన విభాగం పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన 37.2 తులాల బంగారం, 470 గ్రాముల వెండి, రూ.3.60 లక్షల నగదు, కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ కె. నర్సింహ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జగద్గిరిగుట్టకు చెందిన పట్నం శెట్టి రాజు అలియాస్ రాజిరెడ్డి (41) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గతంలోనూ దొంగతనాలకు పాల్పడ్డాడు. 2009లో ఖమ్మంలో సైకిల్ దొంగతనం చేసి జైలుకు వెళ్లిన అతడు.. 2015, 2016లో జగద్గిరిగుట్ట పరిధిలో ఐదు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కాడు.
ఇళ్లను పరిశీలించి.. తెల్లవారుజామున చోరీలు
హైదరాబాద్ నుంచి ప్రయాణికులను కారులో కోదాడకు తీసుకొచ్చిన నిందితుడు రాత్రి అక్కడే ఉండేవాడు. నిర్మానుష్య ప్రాంతంలో కారును నిలిపి.. తెల్లవారుజామున పట్టణంలో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవాడు. అనంతరం స్క్రూడ్రైవర్‌తో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బంగారం, వెండి, నగదు అపహరించేవాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన కారు అసలు నంబరు ఏపీ 28 బీవై 7770కు బదులుగా నకిలీ నంబరు టీఎస్ 07 జీసీ 1612ను ఉపయోగించేవాడు.
2021 నుంచి 10 చోరీలు
కోదాడ పట్టణంలో 2021 నుంచి ఇప్పటి వరకు మొత్తం 10 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు. ఈ ఏడాది ఏడు ఇళ్లలో చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన ఆభరణాల్లో కొన్నింటిని విక్రయించగా.. మరికొన్నింటిని కరిగించి, ఇంకొన్ని ఆర్థిక సంస్థల్లో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు, అప్పుల చెల్లింపులకు వినియోగించినట్లు వెల్లడైంది.
వాహన తనిఖీల్లో పట్టుబాటు
విజయవాడకు దొంగిలించిన బంగారు ఆభరణాలను తీసుకెళ్లి విక్రయించేందుకు నిందితుడు కారులో బయలుదేరాడు. బుధవారం ఉదయం సుమారు 8 గంటలకు సూర్యాపేట నుంచి కోదాడ పట్టణంలోని పైవంతెన మీదుగా హుజూర్‌నగర్ పైవంతెన వద్దకు చేరుకున్న సమయంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులను గమనించిన నిందితుడు వాహనాన్ని వెనక్కి తీసుకుని తప్పించుకునే ప్రయత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వాహనాన్ని తనిఖీ చేయగా సంచుల్లో బంగారం, వెండి ఆభరణాలు, నగదు లభించాయి. అలాగే తాళాలు పగులగొట్టేందుకు ఉపయోగించిన స్క్రూడ్రైవర్లు, షూ సాక్సులు కూడా లభించాయి. దీంతో విచారణ చేపట్టగా కోదాడలో చేసిన దొంగతనాలను నిందితుడు అంగీకరించాడు. అతడి నుంచి హోండా అమేజ్ కారు, వివో వై31 5జీ సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఈ సందర్భంగా ఎస్పీ కె. నర్సింహ మాట్లాడుతూ.. నేరాలకు పాల్పడిన వారు ఎప్పటికైనా చట్టానికి చిక్కక తప్పదన్నారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంటి వద్ద నిఘా కెమెరాలు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎక్కువ రోజులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు విలువైన వస్తువులు, నగదు ఇంట్లో ఉంచవద్దన్నారు. ఇరుగు పొరుగు వారికి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 112కు సమాచారం అందించాలని కోరారు.
పోలీసులకు అభినందనలు
కేసుల దర్యాప్తును పర్యవేక్షించిన కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, నిందితుడి అరెస్టులో కీలకంగా పనిచేసిన నేర పరిశోధన విభాగం ఇన్‌స్పెక్టర్ శివకుమార్, కోదాడ పట్టణ ఇన్‌స్పెక్టర్ శివశంకర్, ఎస్సైలు హరికృష్ణ, సాయిరాం, ఎస్సై అజయ్‌కుమార్‌తో పాటు సిబ్బంది వెంకన్న, విద్యాసాగర్, మల్లేష్, సతీష్, శివ, ప్రభాకర్, మంజులను ఎస్పీ అభినందించి నగదు పురస్కారాలు అందజేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి