తెలంగాణ భాష, యాస, సంస్కృతిని కాపాడుకోవాలి
అదనపు కలెక్టర్ బి. హరిసింగ్
తెలంగాణ ప్రజల జీవన విధానం, భాష, యాస, సంస్కృతి, సామాజిక చైతన్యాన్ని తన రచనల ద్వారా చాటిచెప్పిన మహనీయుడు కాళోజి నారాయణరావు అని అదనపు కలెక్టర్ బి. హరిసింగ్ అన్నారు. కాళోజి జయంతిని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాకవిగా, సామాజిక ఉద్యమకారుడిగా కాళోజి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. సామాన్యుల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. సమాజంలోని అన్యాయాలు, అసమానతలు, ప్రజల ఇబ్బందులపై తన రచనల ద్వారా స్పందిస్తూ చైతన్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు.
తెలంగాణ భాష, యాసకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం తీసుకురావడంలో కాళోజి సాహిత్యం ఎంతో కీలకమన్నారు. తెలంగాణ భాష మన అస్తిత్వానికి ప్రతీక అని, అది కేవలం మాట్లాడే విధానం మాత్రమే కాకుండా జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవానికి ప్రతిరూపమని వివరించారు. ఆధునిక కాలంలో ఇతర భాషల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మాతృభాష, తెలంగాణ యాస, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
యువత కాళోజి సాహిత్యాన్ని చదివి ఆయన ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో డీఆర్వో ప్రేమ్‌రాజ్, బీసీ సంక్షేమ అధికారి విశాల్‌ధారా, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీడబ్ల్యూవో నరసింహారావు, డీటీవో రవికుమార్, డీఎస్‌వో మోహన్‌బాబు, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి