బీఆర్‌ఎస్ నేతల తీరుపై మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల యాదగిరి ఆగ్రహం.
వలిగొండ, సెప్టెంబర్ 9: దళితుల ఓట్లతో పదేళ్లు అధికారాన్ని అనుభవించిన బీఆర్‌ఎస్ నాయకులు.. అదే దళితులు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే అవమానించడం వారి దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మాల మహానాడు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల యాదగిరి మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో దళిత, గిరిజనులు ఎన్నో త్యాగాలు చేశారని యాదగిరి గుర్తుచేశారు. వారి త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు.. నేడు అదే దళిత సమాజాన్ని చిన్నచూపు చూడటం సిగ్గుచేటన్నారు.
దళితులు తమకు వ్యతిరేకంగా నినాదాలు చేశారనే కారణంతో అవమానించేలా వ్యవహరించడం, రోడ్డుపైకి వచ్చారనే కారణంతో పసుపు నీళ్లు చల్లడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు, మానవత్వానికి, సామాజిక సమానత్వానికి విరుద్ధమని పేర్కొన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించేది లేదని హెచ్చరించారు.‘అధికారం కోసం దళితుల ఓట్లు కావాలి.. హక్కుల కోసం ప్రశ్నిస్తే అంటరానివారిలా చూస్తారా?’ అని బీఆర్‌ఎస్ నాయకులను యాదగిరి ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను గౌరవించకుండా, దళితుల ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ తిరిగి అధికారంలోకి రావాలని కలలు కనడం భ్రమేనన్నారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూసే రాజకీయాలకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న దళిత నాయకులు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. “మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఎవరి కింద పనిచేస్తున్నాం? మన సమాజాన్ని అవమానించే నాయకత్వంతో ఇంకా ఎందుకు కొనసాగాలి?” అని ప్రశ్నించారు.ఇది రాచరిక వ్యవస్థ కాదని.. ప్రజాస్వామ్య భారతదేశమని యాదగిరి పేర్కొన్నారు. దళిత సమాజాన్ని తక్కువగా అంచనా వేయడం ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదని హెచ్చరించారు. దళితుల ఐక్యతను తక్కువగా అంచనా వేస్తే రాజకీయంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించే ప్రతి చర్యకు ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని యాదగిరి పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి