Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 08:38 PM

స్పూర్తి ఒక దళిత యోధుని సమరగాథ : గుండు నారాయణ రావు

స్పూర్తి ఒక దళిత యోధుని సమరగాథ : గుండు నారాయణ రావు

స్పూర్తి ఒక దళిత యోధుని సమరగాథ  : గుండు నారాయణ రావు
January 24, 2026 05:37 AM 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

స్ఫూర్తి ఒక దళిత యోధుని సమరగాథ - గుండు నారాయణ రావు

రచయిత విజయవాడలోని జాషువా సాంస్కృతిక వేదిక నాయకుడు

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి : డి.డి.దాస్ సీనియర్ జర్నలిస్ట్

భారత దేశంలో దారుణమైన కుల పీడనకు వ్యతిరేకంగా, మనిషిని మనిషి తాకడమే అపవిత్రంగా పరిగణించే అనాగరికమైన అస్పృశ్యతకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగాయి. అటువంటి పోరాటాలకు ఆధ్యులైన వారిలో ఒక దళిత యోధుని కథ ఇది:


అది 1881 సంవత్సరం నాటి కథ. ఆరోజుల్లో ఒక చేరుమాన్ ధర 6 నుంచి 9 రూపాయలు. చేరుమాన్ అంటే తక్కువ కులానికి చెందిన అస్త్రశ్యుడు అని. అంటే ఎవరైనా చేరుమాన్ని కొనుక్కోవచ్చు లేదా అమ్ముకోవచ్చు, అద్దెకు తెచ్చుకోవచ్చు కాదంటే దానం చేయ వచ్చు. ఆరోజుల్లో ఆడపిల్ల అత్తారింటికి వెళ్తుంటే కట్నంగా ఇచ్చి పంపే జీవం లేని వస్తువుల మధ్య చేరుమాన్ కూడా వుండేవాడు. గుళ్ళకు, గోపురాలకు చేరుమాన్ను బహుమతిగా ఇచ్చేసే 'దానకర్ణులు' వుండేవారు. సమాజంలో ఇటువంటి దురన్యాయం రాజ్యమేలుతున్న రోజుల్లో అనృశ్య కుటుంబంలో పుట్టాడు అయ్యంకాళి, నిరక్షరాస్యుడైన అయ్యం కాళి తన జాతి ప్రజల జీవితాలలో మార్పు తెచ్చేందుకు వారి పోరాటాలకు నాయకత్వం వహించాడు. అంటరాని ప్రజల చీకటి బ్రతుకు ల్లో వెలుగులు నింపేందుకు తన జీవితాన్నే ఉద్యమంగా మలుచుకున్నాడు. కేరళ రాష్ట్రంలో తిరువనంతపురానికి ఉత్తరాన 13 కిలోమీటర్ల దూరంలో వెంగనూరు అనే పల్లె ఒకటి వుంది. ఆ ఊరిలో అయ్యన్, మాల దంపతులకు పుట్టాడు కాళి. 1863 ఆగష్టు 28 నాటి మాట. ట్రావెన్కూర్ సంస్థానంలో వెంగళూరు వుండేది. పులయా కులానికి చెందిన అయ్యన్ కుటుంబంలోని ఏడుగురి సంతానంలో కాళి ఒకడు. ఆ తరువాత అతనే అయ్యంకాళి అయ్యాడు. అయ్యంకాళి పొడుగ్గా కండలు తిరిగిన యువకునిగా ఎదిగాడు. మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యం వల్ల ఆ ప్రాంతాలకు ఆయన సుపరిచితుడయ్యాడు. కోడెకారు వయసులో అయ్యంకాళి తన తోటివారితో ఫుట్బాల్ ఆడేవాడు. ఫుట్బాల్ ఆడుతుండగా ఆయన తన్నిన బంతి ఒక నాయర్ ఇంటి కప్పు మీద పడింది. ఆ నాయర్ అయ్యాంకాళిని అగ్రకుల పిల్లలతో నువ్వెప్పుడూ ఆడకూడదు అని హెచ్చరించాడు. అది ప్రారంభం.


అయ్యంకాళి తండ్రి ఒక భూస్వామి వద్ద పని చేసేవాడు. ఆ భూస్వామి అయ్యంకాళి తండ్రితో అడవులను నరికించి సేద్యపు భూములుగా మార్చాడు. దయగల భూస్వామి చదును చేసిన ఆభూమిలో కొంత భాగాన్ని అయ్యంకాళి తండ్రికి ఇచ్చాడు. అది అప్పుడు ఒక పెద్ద సంచలనం. ఒక పులయకు కొద్దిపాటి భూమి ఉండటం కూడా భూస్వాములకు అశాంతిని కలిగించేది. వయసులోవున్న అయ్యంకాళి తన తోటివారితో కలసి హరిశ్చం ద్ర లాంటి నాటకాలు ఆడేవారు. అప్పుడప్పుడు సొంతంగా నాటకాలు తయారు చేసి ఆడే వాడు. సహజంగానే ఇవి అంటరాని వారిని మేల్కొలిపేవిగా వుండేవి. అంటరాని వారిపై జరుగుతున్న దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తుం డేవి. ఒక సామాజిక నిరసనగా వుండేవి. కొచ్చి, మలబార్ ప్రాంతాలలో అంటరాని వాళ్లలో ఇవి చైతన్యం నింపేవి. అతడు రెండు తెల్లని ఎడ్లను కొన్నాడు. వాటి మెడలో రెండు పెద్ద పెద్ద గంటలు కట్టాడు. శుభ్రంగా ధోవతి ధరించాడు. భుజం మీద తువాలు వుండేది. నెత్తిన రుమాలు, మార్కెట్లో గంటల సవ్వడి బండితో బోర విరుచుకొని వెళ్ళే ఈ పులయ యువకుడి వైపు అగ్రవర్ణాలు భయం భయంగా చూసేవారు. పని చూసుకొని తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు అగ్రకుల యువకులు దర్పంతో మల్మాల్ ధోవతి కట్టావేంటి అని అడిగేవారు. దానికి ఆయన, పొడవాటి బాకు తీసి ఖంగున మోగే గొంతుతో నాకు ఎవడైనా అడ్డు వస్తే ఈ పిడిబాకు మజా రుచి చూపిస్తా అనేవాడు. అది అతని ధిక్కారం, అయ్యంకాళి ఎడ్లబండిపై తిరిగినా ఎవరూ అసలు ప్రశ్నించేవారు కాదు. అతనిలా ఇతరులు మాత్రం ఆ వీధుల్లో నడవటానికి వీలు లేదు. అప్పుడే అయ్యంకాళి స్వేచ్ఛ కోసం నడక అనే ఉద్యమం ప్రారంభిం చాడు. బలరాంపురంలోని చెళియార్ ఐజారుకు దళితుల బృందం చేరుకునేసరికి అగ్రవర్ణాల గుంపు వారిని నడవకుండా నిరోధించింది. ఇకనేం కొట్లాట. ఇరువర్గాల రక్తం చిమ్మింది. ఆ రకంగా అది మొదటి దళితుల సాయుధ తిరుగుబాటు ఉద్యమం అయ్యింది.


*చదువు కోసం పోరాటం:


అయ్యంకాళి పిల్లాడిగా వున్నప్పుడు దళితులకు బడిలోకి ప్రవేశం లేదు. కనీసం తన తరువాత తరమైనా చదువు నేర్చుకోవాలని అతనికి వుండేది. 1904 ప్రాంతంలో దళితులను సర్కారీ బడిలోకి రానివ్వనందు వలన సొంత పాఠశాలలు నెలకొల్పే ప్రయత్నం చేశారు. ఈ స్కూళ్లల్లో కనీసం నల్లబల్లలు కూడా వుండేవి కావు, ఇసుకే వారికి బ్లాక్ బోర్డు. వాళ్ళ వేళ్ళే వాళ్ళకు పెన్సిళ్లు. ఈ విధం గా దళితులు బహిరంగంగానే చదువు కుంటూ అగ్రవార్థ పెత్తందార్ల నియమాలను ధిక్కరిం చారు. అన్నింటికన్నా ముందు వెంగనూరులో బడి ఏర్పాటు అయ్యింది. కానీ దాన్ని అగ్రకుల పెత్తందార్లు ధ్వంసం చేశారు. కదులుతున్న తమ పునాదులను కాపాడుకో వడానికి అగ్రవర్ధ పెత్తందార్లు దళితుల మీద భౌతికదాడులకు దిగేవారు. రక్షించుకోవడానికి దళితులు కూడా చిన్న చిన్న పోరాట బృందాలుగా ఏర్పడేవారు.


*రాజదర్శనం


అప్పటికాలంలో మహారాజు అంటే కనిపించే దేవుడు. కనుక ఆయనను దళితులు చూడకూడదు. ఈ పరిస్థితి మారాలని అయ్యం కాళి నిర్ణయించారు. మహారాజావారి దర్శనానికి దొరికే దారులు తెరచి లేవు. ఇంకేంచేయాలి. అప్పుడు ఒక ఉపాయం ఆలోచించాడు. మహారాజా వారి సంవత్సరపు పూజా దినాన దళితులు ఆయన ఒక పెద్ద చిత్రవటాన్ని ఊరేగిస్తూ బయల్దేరారు. ఊరేగింపులోంచి మహారాజు చిత్రపటాలను తొలగించటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. మధ్యలో కొందరు రాళ్ళు విసిరినా లెక్కచేయ కుండా దళితుల ఊరేగింపు పద్మనాభస్వామి దేవాలయం దగ్గరలో వున్న ఈస్టుపోర్టుకు చేరుకుంది. దుమ్మూ, ధూళితో ఉన్న దుస్తులు ధరించిన ఈ నల్ల ఊరేగింపుదారులు దేవాల యం నుండి పూజప్పుర వరకు రహదారికి పక్కన వున్న పొలాల్లో నిలబడిపోయారు. ఆ రహదారి వెంట వెళుతున్న రాజావారు పొలాల్లో పోత పోసినట్టు నిలబడి వున్న దళిత లను చూసి ఆశ్చర్యపోయారు. మహారాజుని మొట్టమొదటిసారి దర్శనం చేసుకున్న దళితులతో పొలాలన్ని నల్లని మేఘం కప్పుకొని వున్నాయని ఒక కవి వర్ణించాడు. అప్పటిదాకా తాను చూడని ఈ దళిత సమూహాన్ని చూసి మహారాజు ఆశ్చర్యపోయాడు. అగ్రవర్ణాల వారికి కోపం తెప్పించే రెండు ధిక్కారాలకు దళితులు పాల్పడ్డారు. ఒకటి రహదారుల మీద నడవటం, రెండు మహారాజు గారిని చూడ టం. ప్రతీకారం తలపెట్టారు. మానక్కాడులో దళితులపై దాడి చేశారు. దీనిని ముందుగానే వూహించిన అయ్యంకాళి యుద్ధంలో ఒక జనరల్ మాదిరి తన దళితసేనను సముద్రతీరం నుంచి విలియాం గుండా వెంగనూరుకు క్షేమంగా తరలించాడు. ధైర్యసాహసాలు కలవాడిగా, ఆజ్ఞాపించే శక్తి కలవాడిగా అయ్యంకాళి ఒక్క తన కులానికి సంబంధించిన నాయకుడిగానే కాకుండా సాధుజన పరిపాలనా సంఘానికి నాయకుడయ్యాడు.


*కేరళలో మొదటి కూలీల సమ్మె:


దళిత పిల్లల్ని బడిలో చేర్చుకోవాలని సాధుజన పరిపాలనా సంఘం చేసిన అనేక పోరాటాల ఫలితంగా 1907లో ప్రభుత్వం ఈ మేరకు దళితులని బడిలో చేర్చుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి రాజాగారి దివాను రాజాగోపాలాచారి దళితులకు మద్దతుగా వుండేవారు. అయితే పైనుండే అగ్రకుల అధికారులు ఈ ఉత్తర్వులను బయటికి రాకుండా చూసేవారు. అయ్యంకాళి ఎలాగోలాగా ఒక ఉత్తర్వును సంపాదించి విద్యాశాఖాధికారులకు ఈ ఉత్తర్వులు అమలుపరచమని కోరాడు. కానీ భూస్వాముల ఆధీనంలో వున్న ఏ పాఠశాలా ఈ ఉత్తర్వును పాటించలేదు. అప్పుడు అయ్యంకాళి మీరు మా పిల్లలను చదివనివ్వకపోతే మీ పొలాల్లో పిచ్చిగడ్డి మొలుస్తుంది. మీ పొలాలు బీళ్ళు పడతాయి అని చెబుతూ సమ్మెకు పిలుపిచ్చాడు. పొలాల్లో పనిచేసే కూలీలను పర్మినెంటు చెయ్యాలనీ, పనుల్లేని దినాలకు వారికి జీతం ఇవ్వాలనీ, వారి పిల్లలకు బడికెళ్ళే హక్కు కల్పించాలని తదితర డిమాండ్లతో సమ్మె ప్రారంభమైంది. భూస్వాములు సహజంగానే ఈ డిమాండ్లకు అంగీకరించలేదు. ప్రపంచం లోనే మొట్టమొదటిసారి జరిగిన వ్యవసాయ కూలీల సమ్మె ఇది. కానీ, ఇక్కడ ఊరేగింపులు లేవు. సైరను మోగిస్తూ తిరిగే జీపుల్లేవు. కరపత్రాలు లేవు, బ్యానర్లు లేవు. అయ్యంకాళి మాటపై కండలా, కన్నీయాపురం, పల్లీచెల్, ముదవుప్పార నుంచి విలియం దాకా పొలాల్లో ఒక్క కూలీ కనపడలేదు, పీచుమని పిట్ట లేదు. సమ్మెగట్టిన కూలీలను చూసి భూస్వాములు నవ్వుకున్నారు. కడుపు కాలితే వాళ్ళే వస్తారు అని ఎగతాళి చేశారు. కృష్ణపిళ్లే అనే భూస్వామి కూలీల విశ్వాసాన్ని దెబ్బతీయటానికి, వాళ్ళని బెదిరించడానికి ఒక గ్రూపును తయారు చేసి వాళ్లను కొట్టడం ప్రారంభించాడు. వీళ్ళకు లొంగేదేంటి అని ఒక డజను మంది భూస్వా ముల్ని పొలాల్లోకి దింపి పని ప్రారంభించాడు. కొందరు భూస్వాములు వరి నాట్లు వేశారు. కానీ, పంట రాలేదు. ఎండలో పనిచేసినందుకు కొందరు భూస్వాములకు ఆరోగ్య సమస్య లొచ్చేవి. భూస్వాములు, కూలీలు ఇద్దరికీ తిండిగింజల కొరత మొదలైంది. అనంతమైన ఆకలి కూలీలను నిర్వీర్యం చేసింది. ఇలాంటి సమయంలో అయ్యంకాళి ఒక ఎత్తుగడ వేసి విలియంలోని మత్స్యకారులతో కలిసి ఒక ఒప్పందానికి వచ్చాడు. కూలీల కుటుంబాల నుంచి ఒక్కొక్కరిని చేపల పడవ మీద పనికి తీసుకెళ్ళేటట్లు, చేపల్లో కొంత వాటా ఇచ్చేటట్లు వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సమ్మె పూర్తయ్యేవరకు ఇది కొనసాగింది. భూస్వా ములు కూలీల చేతుల్లో ఓడిపోవటం అనివా ర్యం అయ్యింది. వారు కూలీల మీద దౌర్జన్యానికి దిగారు. అత్యాచారాలు చేశారు. కూలీల ఇళ్లు తగలబెట్టారు. కూలీలు ప్రతిఘటించారు. ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో అని భూస్వా ములు భయపడ్డారు. కొన్ని శాంతి ప్రతిపాదన లతో భూస్వాములు రాజీకి వచ్చారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదర్చడానికి దివాన్ ఒక మధ్యవర్తిని కూడా పంపాడు. కూలీల వేతనాలు పెంచటానికి, స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు పిల్లలను బడిలో చేర్చుకునే హక్కును సూత్ర ప్రాయంగా అంగీకరించారు. ఇది జరిగిన తరువాత అయ్యంకాళి భూస్వాముల ఏకైక శత్రువు అయ్యాడు. అయ్యంకాళిని ప్రాణంతో పట్టి తెచ్చినవారికి రూ॥2000, చంపి తెచ్చినవారికి రూ॥1000 తలకు వెల కట్టారు. ఫలితంగా చాలా నెత్తురు పారింది. కానీ, అయ్యంకాళి చెక్కు చెదరకుండా నిలబడ్డాడు.


*ప్రజాసభ సభ్యులు:

మహారాజావారి ప్రజాసభలో సమాజం లోని అన్ని వర్గాల ప్రజా ప్రాతినిథ్యం వుండేది. ప్రజాసమస్యలను, ఫిర్యాదులను రాజు దృష్టికి తెచ్చేందుకు ఈ సభ ఉపయోగపడేది. కానీ, జనాభాలో 5 లక్షల మందిగా వున్న పులయాల కు మాత్రం సవర్ణుడైన పి.కె గోవిందు పిళ్లే ప్రాతినిథ్యం వహించారు. మానవతావాది అయిన పిళ్లే 1911 ఫిబ్రవరి 18న సభలో మాట్లాడుతూ కనీసమైన మానవహక్కులు, స్వేచ్ఛ కూడా దళితులకు ఇవ్వటం లేదు. ఫలానా చోట ప్రభుత్వ భూమి వుంది, మేం ఆ భూమిలో పండించుకుంటాం అని కోరినప్పుడల్లా అగ్ర వర్ణాల వారు అడ్డుకుంటున్నారు. వారికి చదువుకునే హక్కు లేదు, ప్రభుత్వం వారికి భూమిని, చదువుకునే హక్కుని కల్పిస్తే ఈ అభాగ్యులకు ఏ సహాయం అక్కర్లేదు అని గోవిందుపిళ్లే అన్నారు. ప్రజాసంఘ సభ్యుడిగా అయ్యంకాళిని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన విని సభలో వారు గంగవెర్రులెత్తారు. ఒక అంటరాని వాడు ఈ గౌరవ సభలో నిలబడి మాట్లాడటమా అని గొడవ చేశారు. అయినా గోవిందు పిళ్లే ప్రతిపాదనని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్య మీద బడుగుజీవుల విముక్తి ఆధారపడి వుందని అయ్యంకాళి నమ్మాడు. చదువుకోవడానికి పిల్లలను బయట రాష్ట్రాలకు పంపటం ఆర్థికంగా వెసులుబాటు కాదని తెలుసు. అయ్యంకాళి చివరకు ప్రజాసభసభ్యుని హెూదాలో దివాన్ కార్యాలయానికి వెళ్ళాడు. కానీ, అక్కడి కాపలాదారులు అతనిని లోపలికి అనుమతించలేదు. అయ్యంకాళి బయటకు వెళ్ళి దివాన్ పేరిట టెలిగ్రామ్ ఇచ్చారు. నిముషాల లోపున అయ్యంకాళిని అనుమతించండి అని దివాన్ ఇచ్చిన ఆజ్ఞతో అయ్యంకాళి దివాన్ను కలిశాడు. ప్రభుత్వ భూముల మీద మాకు పట్టాలు కేటాయించటం పై చేసిన వాగ్దానం మేరకు మేము అధికారులకు దరఖాస్తు చేసుకున్నాం. కానీ, రెవెన్యూ శాఖలో వున్న ఉద్యోగులు భూస్వాములతో కుమ్మక్కై అగ్రవర్ణ కుటుంబాలకు ప్రభుత్వ భూముల్ని కేటాయించారు. అంతేకాదు, అడిగినందుకు మమ్మల్ని ఊళ్ళ నుంచి, ఇళ్ళ నుంచి తరిమే శారు. చివరికి మేము వున్నది కూడా పోగొట్టు కున్నాం. అందుకోసం మాకు ప్రభుత్వ భూమి కేటాయించాలని నిరక్షరాస్యుడైన ఒక పులయనేత అయ్యంకాళి ప్రసంగం దివాన్ను ఆకర్షించింది. పులయాలకు సహాయపడటానికి ప్రభుత్వం 500ల ఎకరాల భూమి విలాప్పిల్ పగుతీలో ఇచ్చింది.


* పెరినాడు అల్లర్లు


దళిత స్వాతంత్ర్యం కోసం పోరాటం కొనసాగుతూనే వుంది. డిమాండ్లు, వేతనాల సవరణ పనిగంటల తగ్గింపు దాకా ఎదిగాయి. భూస్వాముల కూలీలలతో క్రూరంగా ప్రవర్తించ సాగారు. దళితుల్లో యువకులు అగ్రవర్ణాల దౌర్జన్యాన్ని ప్రతిఘటించడానికి సర్వసన్నద్ధ మవుతున్నారు. ప్రథమ ప్రపంచ యుద్ధం వల్ల ఆర్థిక పరిస్థితులు కడా పూర్తిగా దిగజారాయి. కూలీలు రోజులో 11గం॥ 12గం॥ల దాకా పనిచేసినా భూస్వామి సంతృప్తి చెందటం లేదు. ఒకరోజు కూలీగా ఒకటిన్నర కిలోల ధాన్యం ఇస్తే దాంట్లో అరకిలో తాలు వుండేది. కూలీగా ఇచ్చిన ధాన్యంలో భూస్వాములు ఆ తాలును చెరిగేవారు కాదు. పనికి కొంచెం ఆలస్యంగా వచ్చినా తన్నులే. ఉతికిన బట్టలు వేసుకున్నా తన్నులే. దళితులందరూ మోకాళ్ళు పైనుంచి ఛాతి వరకు మాత్రమే దుస్తులు ధరించాలి. తేడా వస్తే చెట్టుకు కట్టేసి కొట్టేవారు. దళిత కూలీకి కుటుంబ సంబంధాలు వుండకూడదు. భూస్వామి లాలస కోసం కూలీల గుడిసెల మధ్యలో ఒక ప్రత్యేక గుడిసె ఏర్పాటు చేయాలి. దళిత కూలీల ఇంట్లోని మహిళలు భూస్వామి కోరికలు తీర్చాలి. ఇది దురాచారం. ఆ దశలో అయ్యంకాళి దళిత మహిళలకు ఒక సందేశం ఇచ్చారు. మెడ చుట్టూ వేసుకునే చెక్కిన రాతి నక్లీసులను విడనాడాలని పిలుపునిచ్చారు. ఈ నక్లీసులు బానిసతనానికి గుర్తు. మెడల మీదుగా చనుకట్టు పై వేలాడే ఆ గొలుసులు తప్ప దళిత మహిళలు పైన ఏమి ధరించకూడదనేది అప్పటిదాకా ఆచారం. అవి పాముల్లా వేలాడేవి. గాజుతోనూ, రాళ్ళతోనూ చేసిన ఈ గొలుసులు దళిత మహిళల మెడ చుట్టూ కప్పేసి వుండేవి. మణికట్టు చుట్టూ కట్టుకునేవారు. చెవులకి జూకాల్లాగా ఇనపాభరణాలు వుండేవి. బానిస గుర్తులకు వ్యతిరేకంగా అయ్యంకాళి పోరాటం ప్రారంభించారు. ఆ పోరాటంలో విజయం సాధించారు. పాత సాంప్రదాయాలు విడనాడాలనే అయ్యంకాళి ఇచ్చిన పిలుపు

సవర్ణలైన కొల్లాములను ఒక ఊపు ఊపింది.


* పులయ దేవాలయ ప్రవేశ ఉద్యమం


1917లో 2 వేల మంది పులయాలతో ఒక చారిత్రకాత్మకమైన ఊరేగింపు నిర్వహించి చెంగలూరు దేవాలయంలోకి ప్రవేశించాడు అయ్యంకాళి, దేవాలయ ప్రవేశం ఆర్డినెన్స్ వెలివడే కన్నా పదేళ్ళు ముందు ఇది జరిగింది. అందువల్ల దీన్ని దేశంలోనే మొట్టమొదటి

దేవాలయ ప్రవేశంగా పేర్కొనవచ్చు. అంటరాని వాళ్ళ కోసం, దళితుల కోసం చివర వరకు పోరాడిన సంస్కర్త శ్రీ అయ్యంకాళి, నిమ్నవర్గాల అభ్యున్నతి కోసం శ్రీ నారాయణ గురు చేపట్టిన కార్యక్రమాలు దళితులు చైతన్యానికి ఉపయోగ పడేవి. దక్షిణ మధ్య కేరళలో నిమ్నవర్గాలు సంస్థలు స్థాపించిన తరువాత పోరాటాలు మలబార్చుకు కూడా వ్యాపించాయి. చిరగల్ తాలూకాలో అంటరాని వాళ్ళు తమ డిమాండ్ల సాధనకు కదలటంతో అక్కడి పోలీసులు వాళ్ళను చితకబాదారు. ఈ దౌర్జన్యాలకు, అత్యాచారా లకు వ్యతిరేకంగా కొందరు సామాజిక కార్య కర్తలు సత్యాగ్రహం జరపాలని నిర్ణయించారు. 30సంవత్సరాల సేవ, అనేక పోరాటాల వల్ల సాధు జన పరిపాలనా సంఘం ఒక మహా సంస్థగా ఆవిర్భవించింది. తరతరాలుగా అనుభవిస్తున్న బాధల నుండి నూన్యత నుండి కొద్దిపాటి ఉపశమనం కలిగింది. దళితుల దేవాలయ ప్రవేశం గొప్పవారి గొప్పబుద్ధి వల్ల సాధ్యమైందని, చరిత్రకారులు చెప్పవచ్చు. కానీ, దేవాలయాల గేట్లు అందరికీ తెరుచుకోవటం వెనుక దళితుల జీవన్మరణ పోరాటాలు, నెత్తుటి త్యాగాలు, నిరపమాన ధైర్యసాహసాలు ఉన్నాయన్నది చారిత్రక నిజం.


*అయ్యంకాళి - మహాత్మాగాంధీ


నిరక్షరాస్యుడు, అంటరాని బుద్ధిశాలి

అయ్యంకాళి గురించి మహాత్మాగాంధీ విన్నారు. ఒక అంటరాని వారికే కాదు, కేరళ ప్రజలకు అయ్యంకాళి చేసిన సేవలు కూడా గాంధీకి తెలుసు. 1937లో కేరళలో ఒక మారుమూలన వున్న వెంగనూరులో అయ్యంకాళిని కలుసుకోవ టానికి మహాత్మాగాంధీ వెళ్ళారు. అయ్యంకాళిని చెరువుగా తీసుకొని కూర్చోపెట్టుకోవటం, అక్కడ కూడిన పెద్దలకు దిగ్భ్రాంతిని కలిగించింది. గాంధీ మాట్లాడుతూ నువు చేస్తున్న పనంతా నాకు తెలుసు, నేను కూడా నీ వయసువాడినే, మనిద్దరం స్వేచ్ఛకోసం పోరాడుతున్నాం, మీ పనిని కొనసాగించండి అన్నారు. దానికి అయ్యంకాళి, మహాత్మాజీ మీ దయను నేను మర్చిపోలేను. మేము బడిలో చదువుకునే స్వేఛ్ఛ సంపాదించాం. దేవాలయాల్లో పూజల కోసం ప్రవేశాన్ని సాధించాం. బానిస బంధాలను తెగదెంచేదానికి పోరాడుతున్నాం అన్నాడు.


ఇంకా మీ ప్రజలకు ఏం కావాలని గాంధీ అడిగారు. నేను చనిపోయేలోపు దళితుల్లో 10మంది బి.ఏ గ్రాడ్యుయేట్స్ ను చూడాలని వుంది అని అయ్యంకాళి విన్నవించారు. నీ పని కొనసాగించు, నీ కోరిక తీరుతుంది అని గాంధీ చెప్పారు. జాతీయోద్యమంలో కూడా అయ్యం కాళి తనవంతు పాత్రను నిర్వహించారు. జాతి విముక్తి పోరాటాలకు ఆకర్షితులైన యువకుల విప్లవ ఉత్తేజాన్ని ఆయన చూశాడు. జాతీయ స్వాతంత్య్ర పోరాటంలో ఎవరి పాత్ర వారు పోషించాలని దీర్ఘకాలంలో దేశభక్తులు ఈ స్రవంతిలో ఉండాలని ఆయన కోరారు. శారీరక శ్రమ చేసేవారంతా నా సోదరులు. రోజంతా కష్టపడి శ్రమ మర్చిపోవడానికి ఆడ, మగా కలిసి కల్లు దుకాణానికి వెళ్ళటం తగదని, ఇది కుటుంబాల్లో దరిద్రాన్ని పెంచుతుందని, మనలో శుభ్రత, సుచి లేకుండా చేస్తుందని, మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని, కనుక మనం తాగకూడదని ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఆ సమావేశానికి వేలాదిమంది హాజరయ్యారు. అయ్యంకాళి ఆరోగ్యం క్షీణించటం ప్రారంభమయ్యింది. ఉబ్బసం ఆయనను ఇబ్బంది. పెట్టింది. 1941 కల్లా అయ్యంకాళి పూర్తిగా లేవలేని స్థితికి చేరుకున్నారు. 1941, జూన్ 18న ఉబ్బసం వ్యాధితో ఆయన మరణించారు. ఆవిధంగా ధైర్యసాహసాలు కలిగిన ఒక దళిత పుత్రుడు తన జీవిత కోర్కెలు సఫలమయ్యే సమయం ఎంతో దూరం లేదన్న సంతృప్తితో ప్రశాంతంగా మరణించారు.


అయ్యంకాళి నాయకత్వంలో జరిగిన 1907 చారిత్రాత్మక వ్యవసాయ కూలీల సమ్మె దేశానికే కొత్త ఒరవడిని దిద్దిందని 1980 మార్చిలో కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ (ఎం) అగ్రనాయకుడు కామ్రేడ్ ఇ.యం.ఎస్. సంబూద్రిపాద్ అన్నారు. అంబేద్కర్, అయ్యంకాళీ ల పాత్రను ఎవరూ దాచిపెట్టలేరు. ప్రజల స్మృతి నుంచి అయ్యంకాళి కొన్నాళ్ళు మాత్రమే అదృశ్యమ య్యారు. సమాజానికి ఆయన చేసిన సేవలు అంచనా కట్టడానికి 40 సంవత్సరాలు పట్టిందని మానాదిడుతునాటి ముఖ్యమంత్రి ఇకె నయనార్ మొట్టమొదటి కూలీల నాయకుడు, అసంఘటితంగా, చిన్న చిన్న సమూహంగా వున్న కూలీ లందర్ని ఆయన ఒక తాటిపైకి తెచ్చి వారికి సంఘటిత శక్తి ఏంటో తెలియజెప్పారు, అని అన్నారు. అయ్యంకాళి పేరుతో ఏర్పడిన ట్రస్టు ఆయన నిలువెత్తు విగ్రహంతో మద్రాసు నుంచి కేరళ అంతా విజయోత్సవ ఊరేగింపు జరిగిం ది. ఈ విగ్రహం కేరళ అంతటా ఊరేగించినపు డు కేరళ ప్రజలు రోడ్డుపక్కన బారులు తీరి భారతదేశంలో అయ్యం కాళి సందర్శించారు.


అయ్యంకాళి అస్పృశ్యుల విముక్తి పోరా టాలు నడిపిన ప్రథమ నాయకుడు. భారతదేశపు ఆత్మలో అంటరానితనం ఒక మాయని మచ్చ. ఇప్పటివరకు భారతదేశాన్ని ఈ అంటరానితనమే వెనకబాటుకు గురి చేసింది. స్వేచ్ఛ, సమానత్వం విడదీయరానిది. సమానత్వం లేకుండా అసలైన స్వేచ్ఛ లేనే లేదు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప అనే చైతన్యంతో. వివక్షతకు వ్యతిరేకంగా పోరాడటమే. అయ్యంకాళికి మనమిచ్చే నిజమైన నివాళ్ళి *

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News