సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు స్వస్తి పలుకుదాం..
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు స్వస్తి పలుకుదాం..
NM Yadav
భూమి రక్షణ మనందరి బాధ్యత కలెక్టర్ బి. చంద్రశేఖర్..
ప్రకృతిని కాపాడేందుకు మొక్కలు నాటాలి..
నల్గొండలో ఘనంగా అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం..
సైకిల్ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్..
నల్గొండ : ప్లాస్టిక్ రక్కసి కోరల నుండి భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. 'అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం' (ఎర్త్ డే) సందర్భంగా బుధవారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నల్గొండ కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి స్వయంగా సైకిల్ తొక్కి విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు.
ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణం పెను ప్రమాదంలో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. మానవ తప్పిదాల వల్ల భూమి, జలం, వాయువు కాలుష్యమయమై జంతుజాలానికి మనుగడ కష్టంగా మారుతోందన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించి, దానికి ప్రత్యామ్నాయంగా కాటన్ సంచులు, స్టీల్ లేదా మట్టి బాటిళ్లను వాడాలని సూచించారు. వాడిన ప్లాస్టిక్‌ను భూమిలో పారవేయకుండా రీసైక్లింగ్ చేయడంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా పర్యావరణ పరిరక్షణపై గ్రామ స్థాయి నుంచి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
భూమికి ప్రతిరూపమైన అమ్మను ఎలా గౌరవిస్తామో మాతృభూమిని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. అందమైన జీవితం కావాలంటే ఆరోగ్యకరమైన ప్రకృతి అవసరమని ఆయన పేర్కొన్నారు. అనంతరం మాతృభూమి దినోత్సవంపై రూపొందించిన ప్రత్యేక గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, అధికారుల చేత పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారి (DFO) రాజశేఖర్, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి శాఖ అధికారి మహమ్మద్ అక్బర్ అలీ, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, జిల్లా సైన్స్ అధికారి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి