నల్గొండ బిడ్డ డా. డి. మాక్లాకు అరుదైన గౌరవం
ఉస్మానియా వర్సిటీ 85వ స్నాతకోత్సవంలో పురస్కారం.
హైదరాబాద్, సెప్టెంబర్ 11: పేదరికాన్ని జయించి ఉన్నత విద్యలో రాణించిన నల్గొండ జిల్లా బిడ్డ డా. డి. మాక్లాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక ‘తెలంగాణ గవర్నర్ గోల్డ్ మెడల్’ను ప్రదానం చేసింది.
సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం 85వ వార్షిక స్నాతకోత్సవంలో డా. మాక్లా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2025 విద్యా సంవత్సరానికి ఆర్ట్స్ ఫ్యాకల్టీలోని ఇంగ్లిష్ విభాగంలో షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) విద్యార్థి సమర్పించిన ఉత్తమ పీహెచ్‌డీ థీసిస్‌కు ఈ గోల్డ్ మెడల్ లభించింది.
మారుమూల పల్లె నుంచి..
నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన డా. డి. మాక్లా నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఎన్నో ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే విద్యను ఆయుధంగా చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగారు. మారుమూల పల్లె నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయికి చేరుకోవడంతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయం గవర్నర్ గోల్డ్ మెడల్ అందుకునే స్థాయికి చేరింది.
పరిశోధనా రంగంలో ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. డా. మాక్లాకు హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంగ్లిష్ విభాగం అధ్యాపకులు, వెంకటాద్రిపాలెం గ్రామస్తులు, విద్యార్థులు, మిత్రులు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి