సూర్యాపేట, ఆగస్టు 24: ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా, మండల స్థాయిలో ప్రజావాణికి అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. పాత ప్రజావాణి పోర్టల్‌లో పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను కూడా ఆలస్యం లేకుండా పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు.
రాష్ట్ర ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి అధికారి తమ లాగిన్‌లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా సత్వర పరిష్కారం చూపాలని అన్నారు.
మండల స్థాయిలో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. మండల స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కారమైతే ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన ఇబ్బంది తగ్గుతుందని పేర్కొన్నారు.
ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న వనమహోత్సవంలో సంబంధిత జిల్లా అధికారులు సామూహికంగా పాల్గొని తమకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే జిల్లా, మండల ప్రభుత్వ కార్యాలయాల్లో ఆగస్టు 31లోగా టీ-ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 68 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. వీటిలో భూ సమస్యలకు సంబంధించి 43, ఇరిగేషన్‌కు 4, మున్సిపాలిటీలకు 4, డీడబ్ల్యూఓకు 3 దరఖాస్తులు రాగా, మరో 14 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించినవిగా ఉన్నాయని వివరించారు. దరఖాస్తులను శాఖల వారీగా పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్వో ప్రేమ్ రాజ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డీఆర్డీఏ పీడీ సన్యాసయ్య, సీపీఓ కిషన్, డీఎస్ఓ మోహన్ బాబు, డీపీఓ యాదగిరి, డీఏఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి