ప్రభుత్వ పాఠశాలల కుదింపుపై సీపీఎం ఆగ్రహం 4 వేలకే పరిమితం చేసే యత్నం ఉపసంహరించాలి
ప్రభుత్వ పాఠశాలల కుదింపుపై సీపీఎం ఆగ్రహం 4 వేలకే పరిమితం చేసే యత్నం ఉపసంహరించాలి
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
ఖాళీ ఉద్యోగాల భర్తీకి జూన్ 16,17న హైదరాబాద్‌లో యువజన సమ్మేళనం : జాన్ వెస్లీ
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను కుదించే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు తక్కువగా ఉన్నారనే పేరుతో 16 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేసే ప్రయత్నం విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మౌలిక సదుపాయాలు తక్షణమే అందించాలని సూచించారు. రాష్ట్ర విద్యా కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత పాలకులు, ప్రస్తుత ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్య పరిష్కారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో సీపీఎం ఆధ్వర్యంలో జూన్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. గ్రామాలు, మున్సిపల్ కేంద్రాల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఓటర్ల జాబితా రూపొందించాలని సూచించారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో విద్య, వైద్యం, నిరుద్యోగం, రేషన్ దుకాణాల్లో 14 రకాల నిత్యావసర వస్తువుల సరఫరా తదితర అంశాలపై సర్వేలు, ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ దృష్ట్యా ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని, పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా నిధులతో పాటు ఖరీఫ్ రైతు భరోసాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యూరియా విక్రయానికి అమలు చేస్తున్న యాప్‌ను రద్దు చేసి, అన్ని వ్యవసాయ సహకార సంఘాలు, దుకాణాల్లో యూరియా, డీఏపీ ఎరువులను అందుబాటులో ఉంచాలని హెచ్చరించారు. లేదంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేశం, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, సయ్యద్ హాషం, పాలడుగు ప్రభావతి, చినపాక లక్ష్మీనారాయణ, వీరేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి