ఆపరేషన్ పోలోతోనే నిజాం పాలనకు అంతం: నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ నవనీత
స్థానిక నారాయణ హై స్కూల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నవనీత పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానానికి మాత్రం విముక్తి లభించలేదని ఆమె గుర్తుచేశారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన రాజ్యాన్ని స్వతంత్ర దేశంగా ఉంచాలని భావించాడన్నారు. "భారత్‌లో కలవను.. అవసరమైతే పాకిస్థాన్‌లో కలుస్తా" అని బెదిరింపులకు దిగుతూ, కాశిం రజ్వీ నాయకత్వంలోని 20,000 మంది రజాకార్లతో పల్లెలపై దాడులు చేయించారని విమర్శించారు. నిజాం పాలనలోని రాక్షసత్వాన్ని, మరణహోమాన్ని ఎంతమాత్రం సహించని అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవ తీసుకున్నారని తెలిపారు.
1948 సెప్టెంబర్ 13న భారత సైన్యంతో 'ఆపరేషన్ పోలో'ను ప్రారంభించి, సెప్టెంబర్ 17 సాయంత్రానికి నిజాం సైన్యాన్ని లొంగదీసుకున్నారని వివరించారు. దీంతో 235 ఏళ్ల సుదీర్ఘ నిజాం పాలన ముగిసి, హైదరాబాద్ సంస్థానంలో భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరిందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ వెంకన్న, వైస్ ప్రిన్సిపాల్ క్రాంతి మాధవి, ఏవో బాతరాజు వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి