విధులకు డుమ్మా కొడుతున్నారంటూ సూపర్‌వైజర్లపై ఆరోపణలు..
ప్రశ్నిస్తే కింది స్థాయి సిబ్బందికి బెదిరింపులా?
ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాలని సిబ్బంది, ప్రజల డిమాండ్
ఉప్పల్, సెప్టెంబర్ 17:
ఉప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది విధుల నిర్వహణ, హాజరు నమోదుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొందరు సూపర్‌వైజర్లు విధులకు సమయానికి హాజరుకాకపోవడం, హాజరు నమోదు విషయంలో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఆసుపత్రి సిబ్బంది నుంచి వినిపిస్తున్నాయి.
ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు విధులకు సమయానికి రాకపోతే గైర్హాజరుగా నమోదు చేసే అధికారులు.. సూపర్‌వైజర్ల విషయంలో మాత్రం ఎందుకు అదే నిబంధనలు అమలు చేయడం లేదని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే వారిపైనే పర్యవేక్షణ కొరవడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సిన కొందరు సిబ్బంది మధ్యాహ్నం లోపే విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు ఉదయం 11 గంటల సమయంలో ఆసుపత్రికి వచ్చి అటెండెన్స్ నమోదు చేసుకున్నట్లు కొందరు సిబ్బంది ఆరోపిస్తున్నారు.
ఈ విషయాలపై వివరణ కోరేందుకు ప్రయత్నించినప్పుడు, కొందరు సిబ్బంది “మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. రిపోర్టర్లు మమ్మల్ని ఏం చేస్తారు?” అనే ధోరణిలో మాట్లాడుతున్నారని కింది స్థాయి సిబ్బంది ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ప్రశ్నించిన సిబ్బందిని “ఉద్యోగం చేయాలనుకుంటున్నారా.. ఇంటికి వెళ్లాలనుకుంటున్నారా?” అంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విధుల నిర్వహణలో క్రమశిక్షణకు సంబంధించి కింది స్థాయి సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులు, పర్యవేక్షణ బాధ్యతల్లో ఉన్న సూపర్‌వైజర్ల విషయంలోనూ నిబంధనలను సమానంగా అమలు చేయాలని సిబ్బంది కోరుతున్నారు.
ఆసుపత్రిలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, హాజరు రిజిస్టర్లు, బయోమెట్రిక్ వివరాలు, విధుల రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చాలని సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో సిబ్బంది ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా విధులు నిర్వహించే వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి