రాష్ట్రంలో ఒకవైపు నాగార్జున సాగర్ నుంచి యథేచ్ఛగా జలదోపిడీ జరుగుతుంటే, మరోవైపు కొత్త పెన్షన్ల పేరుతో పేదలను, దివ్యాంగులను కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచన చేస్తోందని కోదాడ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు కోదాడలోని తమ నివాసంలో మాజీ శాసనసభ్యులు తిప్పన విజయసింహా రెడ్డి గారితో కలిసి నియోజకవర్గస్థాయి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ జలాశయంలో సంవత్సర కాలంగా 510 అడుగుల డెడ్ స్టోరేజ్ లోతు నుంచి సొరంగాల ద్వారా నీటిని తరలిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. దీనివల్ల డ్యామ్ అడుగుభాగం నుంచే నీరు ఖాళీ అయిపోయి, సాగర్ ఆయకట్టు రైతాంగంతో పాటు కోటి మంది హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు కూడా తీవ్ర ముప్పు వాటిల్లనుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు కాళోజీ నారాయణరావు గారు నాగార్జున సాగర్‌ను 'గంగగోవు'తో పోలుస్తూ, పూజ చేసుకోవడానికి తలకాయ నల్గొండలో ఉంటే, పాలు మాత్రం కుడికాలువకు పోతున్నాయని చెప్పిన విధంగా స్వరాష్ట్రంలో ఈ పాలకుల అసమర్థత వల్ల మళ్లీ పునరావృతమై, కృష్ణా పరివాహక ప్రాంతం ఉమ్మడి రాష్ట్రం కంటే ఘోరంగా ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి అక్కడ ఏమీ జరగడం లేదని చెబుతుంటే, పత్రికలు వాస్తవాలను తాటికాయంత అక్షరాలతో వెలుగులోకి తెచ్చి బీఆర్ఎస్, మేధావులు స్పందించాకే ఇంజనీర్లకు నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కేఆర్ఎంబీకి ఉత్తరాలు రాసి, నోటీసులతో చేతులు దులుపుకోవడం మాని, తక్షణమే తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పి జలదోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఈరోజు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కేఆర్ఎంబీ సమావేశం వద్దకు వెళ్తోందని, రేపు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులంతా నాగార్జున సాగర్ డ్యామ్‌ను సందర్శించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రజాందోళనకు శ్రీకారం చుడుతామని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తమ పోరాటానికి మద్దతు పలకాలని సవాల్ విసిరారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు తప్ప చేసిందేమీ గోరంత కూడా లేదని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ వయోపరిమితిని 61 నుంచి 57 ఏళ్లకు తగ్గించి రూ. 200 ఉన్న పెన్షన్‌ను రూ. 2,000 చేసి అర్హులందరికీ అందిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షలతో, ఆర్థిక భారమనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల పెన్షన్లను, కోదాడ నియోజకవర్గంలో వేలాది పెన్షన్లను తొలగించిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి మూడేళ్ల తర్వాత కుడిచేత్తో లాక్కొని, ఎడమచేత్తో మొక్కుబడిగా కొందరికి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో దేవుళ్ల మీద ఒట్లు వేసి, "వచ్చే నెల నుంచే రూ. 4,000 పెన్షన్ ఇస్తాం" అని నమ్మించి ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తకుండా ప్రజలను నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేతులు తడిపితే తప్ప, పెద్దమనుషుల ఉత్తరాలు, పైరవీలు ఉంటే తప్ప సామాన్యులకు పెన్షన్ గానీ, ఇల్లు గానీ, ఏ ఇతర ప్రభుత్వ పథకం గానీ అందే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో దివ్యాంగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత ఘోరంగా ఉందని బొల్లం మల్లయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సదరం క్యాంపుల పేరుతో వికలాంగులు కానివారికి సర్టిఫికెట్లు మంజూరు చేసి, 60 నుంచి 70 శాతం వైకల్యం ఉండి సర్టిఫికెట్లు పొందిన అసలైన దివ్యాంగులకు పెన్షన్లు నిరాకరించారని ఆరోపించారు. దివ్యాంగుల పెన్షన్ మొత్తం (రూ. 4,000) ఎక్కువగా ఉంటుందనే దురుద్దేశంతోనే వాటిని కుదించి నామమాత్రంగా మంజూరు చేశారని మండిపడ్డారు. హెలికాప్టర్లు, ఫైవ్ స్టార్ హోటళ్లలో 'భారత్ సమ్మిట్'లు, సిరిసిల్ల మరియు సిద్దిపేట సభలకు తాజ్ హోటల్ నుంచి భోజనాలు తెప్పించి ప్రతిపక్షాలను తిట్టడానికి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్న ప్రభుత్వానికి, జీవనమే భారమైన దివ్యాంగులు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం భారమైందా అని నిలదీశారు. పెన్షన్ల అవకతవకలపై పత్రికల్లో వస్తున్న కథనాలను చూసైనా అధికారులు మానవతా దృక్పథంతో చలించి, జాబితాలను పునఃపరిశీలన చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈకార్యక్రమంలో కోదాడ పట్టణ అధ్యక్షులు షేక్ నయం గారు, అనంతగిరి మండల అధ్యక్షులు నల్లా భూపాల్ రెడ్డి గారు, చిలుకూరు మండల అధ్యక్షులు జానకిరామా చారి గారు, మోతే మండల అధ్యక్షులు శీలం సైదులు గారు, కోదాడ పట్టణ 9 వ వార్డు కౌన్సిలర్ చీమ నరేష్ గారు ,నడిగూడెం మండల నాయకులు ఆంజనేయులు గారు, కోదాడ మండల నాయకులు పోట్టా కిరణ్ గారు, తాళ్లూరి శ్రీనివాస్ గారు, వీరయ్య గారు, పొలంపల్లి వెంకటేశ్వర్లు గారు, అఫ్జల్ గారు, కరీం గారు, మాదాల ఉపేందర్ గారు, పాషా గారు, నర్సయ్య గారు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి