నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని హసకొత్తూరు గ్రామానికి చెందిన చెరుకు గంగాధర్ జీవనోపాధి కోసం దుబాయ్‌కి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందడం ఎంతో బాధాకరమని కమ్మర్‌పల్లి మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్ అన్నారు.
గల్ఫ్ దేశాలకు పొట్టకూటి కోసం వెళ్లిన గంగాధర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో భార్య అరుణ,కూతురుతో కూడిన నిరుపేద కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలవడం మనందరి మానవతా బాధ్యత అని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో కమ్మర్‌పల్లి మండల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులంతా తమ వంతు సహకారంతో 10000 రూపాయలు సోమవారం గంగాధర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు.గంగాధర్ కుటుంబం ఒంటరిది కాదని, సమాజం వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించడమే మా ప్రయత్నమని అన్నారు. గల్ఫ్‌లో ఉపాధి కోసం వెళ్లే ఎంతోమంది కార్మికులు ప్రమాదాల బారిన పడుతూ కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు గుర్రం నరేష్, మేకల క్రాంతి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి