మైనర్ బాలికపై మళ్లీ అత్యాచారం నిందితుడికి యావజ్జీవ కారాగారం..
గతంలో 51 ఏళ్ల శిక్ష బెయిల్‌పై వచ్చి మళ్లీ ఘాతుకం..
దర్యాప్తు బృందాన్ని అభినందించిన నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్..
నల్గొండ : మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 23 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నల్గొండలోని ఫాస్ట్ ట్రాక్ (పోక్సో) కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలానికి చెందిన షేక్ అలియాస్ మహమ్మద్ ఖయ్యూం అనే వ్యక్తి గతంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవగా (Cr.No.242/2021), విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు అతడికి 51 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే, తదనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు బుద్ధి మార్చుకోకుండా అదే బాలికను మళ్లీ అపహరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో నల్గొండ-II టౌన్ పోలీసులు కేసు నమోదు (Cr.No.128/2023) చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. న్యాయస్థానంలో నేరం రుజువు కావడంతో గౌరవ న్యాయమూర్తి నిందితుడికి ఈ క్రింది విధంగా శిక్షలు ఖరారు చేశారు.. సెక్షన్ 3(2)(v) కింద యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా, సెక్షన్ 5(j)(ii) r/w 6 కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా, అపహరణ నేరానికి 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో వర్తిస్తాయని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. బాధితురాలికి న్యాయం చేకూర్చేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన డీఎస్పీలు వి.నర్సింహారెడ్డి, శివరాం రెడ్డి, సీఐలు ఆది రెడ్డి, శ్రీను నాయక్, ఎస్ ఐ లు డి.సైదా బాబు, ఎస్ఐ సంపత్, కోర్టు సిబ్బందిని మరియు వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్‌ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు. మైనర్లు, మహిళలపై అరాచకాలకు పాల్పడితే ఎంతటివారికైనా కఠిన శిక్షలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి