ప్రజల హక్కులు, సంక్షేమాన్ని కాపాడటమే లక్ష్యం
డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం (రెడ్‌హౌస్)లో బుధవారం జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలు, అనేక పోరాటాల ఫలితంగా రాచరిక పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణ భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టానికి సెప్టెంబర్ 17 ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. ఆ చారిత్రక నేపథ్యాన్ని స్మరించుకుంటూ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. స్వేచ్ఛ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల గౌరవం, హక్కులు, సంక్షేమాన్ని కాపాడుతూ ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత, సమానత్వంతో కూడిన ప్రజాపాలనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్యాగధనుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్‌తో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి